ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే సత్తా లేదా? | YSRCP Leaders Fires On Chandrababu and TDP Govt: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షాన్ని ఎదుర్కొనే సత్తా లేదా?

Nov 12 2024 5:26 AM | Updated on Nov 12 2024 5:26 AM

YSRCP Leaders Fires On Chandrababu and TDP Govt: Andhra Pradesh

మీ వైఫల్యాలు, దుర్మార్గాలను నిలదీస్తామని భయమా?

ప్రభుత్వ తీరుపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల మండిపాటు

సభలో ఉన్నది రెండు పక్షాలే.. అలాంటప్పుడు ప్రతిపక్ష హోదా ఎందుకివ్వరు?

ఇవ్వకూడదన్న నిబంధన ఏదైనా ఉంటే చూపించం

మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మాట్లాడే అవకాశం ఉండదు

మీరెన్ని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటాం

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వానికి అసెంబ్లీలో వైఎస్సార్‌సీపీని ఎదుర్కొనే సత్తా లేదని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తాటిపర్తి చంద్రశేఖర్‌ (యర్రగొండపాలెం), మత్స్యరాస విశ్వేశ్వరరాజు (పాడేరు), బూసినె విరూపాక్ష (ఆలూరు), రేగ మత్స్యలింగం (అరకు) అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం వారు పార్టీ అధ్యక్షుడు  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఐదు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసిన అవినీతి, అరాచకాలు, హత్యలు, దోపిడీలు, మోసాలతో పాటు.. వరుసగా జరుగుతున్న అత్యాచారాలపై తాము అసెంబ్లీలో ప్రశ్నిస్తే, సమాధానం చెప్పుకోలేమనే భయంతో ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి భయపడుతోందని చెప్పారు. 

ప్రభుత్వం అదే కోరుకుంటోందా? 
‘సభలో తమను ఎదుర్కొనే సత్తా లేదా? లేక మీ దుర్మార్గాలు బయట పడతాయని భయపడుతున్నారా?’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. సభలో రెండే పక్షాలు ఉన్నప్పుడు, విపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. తమకు ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడే సభలో ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కుతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ స్పీకర్‌కు లేఖ రాశారన్నారు.

అయితే దానిని వారు పట్టించుకోక పోవడంతో హైకోర్టును ఆశ్రయించామని తెలిపారు. తమ పిటిషన్‌పై కోర్టు.. స్పీకర్‌ వివరణ కోరితే, కనీసం కౌంటర్‌ కూడా దాఖలు చేయలేదని ఆక్షేపించారు. ఇప్పుడు కీలకమైన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతున్నప్పుడు విపక్షాన్ని పిలవాలని.. కానీ తమకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అంటే ప్రతిపక్షం సభకు రాకూడదని కూటమి ప్రభుత్వం కోరుకుంటోందా? అని ప్రశ్నించారు.

5 నెలలు.. రూ.57 వేల కోట్ల అప్పు 
పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి ఐదు నెలలు ఎందుకు పట్టిందని, ఏ ఒక్క హామీ అమలు చేయకుండానే ఏకంగా రూ.57 వేల కోట్ల అప్పు ఎందుకు చేశారని ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ నిలదీశారు. ఐదు నెలలుగా ప్రతి వ్యవస్థలో అధికారులను తమ ఏజెంట్లుగా మార్చుకుని అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నింటిపై ప్రశ్నిస్తామనే భయంతోనే తాము అసెంబ్లీకి రాకూడదని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. తాము రూ.14 లక్షల కోట్ల అప్పు చేశామని ఇన్నాళ్లూ చంద్రబాబు సహా, ఆ పార్టీ నేతలు చేసిన ప్రచారం పూర్తిగా అబద్ధమని ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో తేలిపోయిందని తెలిపారు. చివరకు అందులో సగం అప్పు కూడా చూపించలేకపోయారన్నారు.

తాము అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై ఎల్లో మీడియా ద్వారా సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేయిస్తుండటం దారుణం అన్నారు. అప్పులు 6.46 లక్షల కోట్లేనని ఇప్పుడు వాళ్లే చెబుతు­న్నారని చెప్పారు. ప్రజా సమస్యలను సమగ్రంగా ప్రస్తావిం­చడానికే ప్రతిపక్ష హోదా కోరుతున్నాము తప్ప సౌకర్యాల కోసం కాదని స్పష్టం చేశారు. 11 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని చట్టంలో ఎక్కడ ఉందో చూపించాలని డిమాండ్‌ చేశారు. సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై బనాయిస్తున్న అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఎన్ని డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటామని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు సంయుక్తంగా వెల్లడించారు.

ఈ ప్రశ్నలకు బదులివ్వండి
మీరిచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తామని భయమా?
హామీలను తుంగలో తొక్కింది వాస్తవం కాదా?
వైఎస్సార్‌సీపీకి ప్రతిపక్షహోదా ఇచ్చే దమ్ము, ధైర్యం లేదా?
సభలో తగినంత సమయం ఇప్పిస్తామని స్పీకర్‌తో ప్రకటన చేయించగలరా?
రాష్ట్రంలో విచ్చలవిడిగా పేకాట క్లబ్బులు, గంజాయి అందుబాటులోకి వచ్చింది నిజం కాదా?
ఊరూరా బెల్టు షాపులు ఏర్పాటు చేయడం లేదా?
రూ.57 వేల కోట్ల అప్పులు తెచ్చి ఏం చేశారు?
ఏకంగా ఐపీఎస్‌ అధికారులను సస్పెండ్‌ చేసి అరాచకానికి పాల్పడింది వాస్తవం కాదా?
మీ అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెట్టడం లేదా?
రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ ఉందా?   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement