సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ సభ్యత్వ నమోదు త్వరలో ప్రారంభమవుతుందని, ప్రజల్లో పార్టీకి ఉన్న ఆదరణ సభ్యత్వంలో ప్రతిఫలించాలని పార్టీ అనుబంధ విభాగాల ఇన్‌ఛార్జి వేణుంబాక విజయసాయిరెడ్డి చెప్పారు. తెలుగువారు ఎక్కడ నివసిస్తున్నా వారి వివరాలన్నీ ఏపీఎన్‌ఆర్‌టీఎస్ వద్ద ఉండేలా చూడాలని అన్నారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు.
సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో వైఎస్సార్‌సీపీ తిరుగులేని శక్తిగా రూపొందిందన్నారు. రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ లేవని తెలిపారు. ప్రతి కార్యకర్త సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని పిలుపునిచ్చారు. మూడు దశాబ్దాల పాటు అధికారంలో ఉండేలా పార్టీని సీఎం జగన్ పటిష్టం చేశారని తెలిపారు. ఇందులో కార్యకర్తల పాత్ర క్రియాశీలకంగా ఉంటుందన్నారు. 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, జెడ్‌పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు లాంటి ఎన్నో పదవులు కార్యకర్తలకు లభించాయని తెలిపారు.
చదవండి: (వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే బలమైన పునాది: విజయసాయిరెడ్డి)
సీఎం జగన్ తనదైన వ్యూహాలతో పార్టీని, ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరే పార్టీ అభ్యర్థుల ఘన విజయాలకు కారణమని తెలిపారు. ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను మరింత ఉత్తేజ పరిచి పార్టీని పటిష్ట పరుస్తున్నామని తెలిపారు. బూత్ స్థాయి కమిటీలను మరింత శక్తివంతం చేయాలన్నారు. ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో పార్టీ అనుబంధ విభాగాల నేతలు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (వైఎస్సార్ సేవాదళ్), తెల్లం బాలరాజు (ఎస్టీ విభాగం), జక్కంపూడి రాజా (యూత్ విభాగం), ఆరిమండ విజయ శారదారెడ్డి(డ్వాక్రా విభాగం), ఖాదర్ బాషా (మైనారిటీ విభాగం), ఆరిమండ వరప్రసాదరెడ్డి, కుప్పం ప్రసాద్ (వాణిజ్య విభాగం), టీఎస్ విజయచందర్ (పబ్లిసిటీ విభాగం), వంగపండు ఉష (సాంస్కృతిక విభాగం), గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి (సోషల్ మీడియా విభాగం), డి.సూర్యనారాయణ రాజు (పంచాయతీరాజ్ విభాగం) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment