సాక్షి, అమరావతి: టీడీపీ కీచక నేత వినోద్‌జైన్‌కు ఉరిశిక్ష విధించాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రభుత్వాన్ని కోరారు. వినోద్ జైన్ వ్యవహారం రాష్ట్రం మొత్తం తలదించుకునేలా ఉందన్నారు. మైనర్ బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించి.. ఆమె ప్రాణాన్ని హరించాడని మండిపడ్డారు. తక్షణమే ఈ ఘటనపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పోతుల సునీత సోమవారం మీడియాతో మాట్లాడారు. 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి.. ఆమె ఆత్మహత్య చేసుకునేలా చేయడం దారుణమన్నారు. వినోద్ జైన్‌ను సంఘం నుంచి వెలివేయాలన్నారు.
నారీ సంకల్ప దీక్షలంటే ఎవరు నమ్ముతారు?
దుర్యోధనుడు, దుశ్శాసనుడికి మహిళల మీద ఎంత గౌరవం ఉందో.. చంద్రబాబు, లోకేష్‌లకూ అంతే గౌరవం ఉందని సునీత ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు బాబు మహిళల్ని వేధించి, వంచించారని ధ్వజమెత్తారు. ఇప్పుడు నారీ సంకల్ప దీక్షలంటే ఎవరు నమ్ముతారని నిలదీశారు. టీడీపీది దుస్సంకల్ప దీక్ష అని విమర్శించారు. నాగార్జున యూనివర్సిటీలో విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదని గుర్తు చేశారు. టీడీపీ హయాంలో నమోదైన లైంగిక వేధింపుల కేసుల్లో పోలీసులు దర్యాప్తు చేసినవి 60 రోజుల్లో కేవలం 14.5 శాతం మాత్రమే అన్నారు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా 93.6 శాతం మేర కేసులను దర్యాప్తు చేశారని తెలిపారు. ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ విషయంలో జాతీయ సగటు కేవలం 40 శాతం మాత్రమేనని చెప్పారు. దీన్ని బట్టి సీఎం వైఎస్ జగన్‌కు మహిళల భద్రత పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.
మహిళలను మోసం చేయడమే బాబు నైజం
40 ఏళ్ల చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసం చేయడం, దగా చేయడమేనని సునీల దుయ్యబట్టారు. మహిళల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నవారిలో సీఎం వైఎస్ జగన్ దేశంలోనే బెస్ట్ సీఎంగా ఉన్నారని కొనియాడారు. చంద్రబాబు దుర్యోధనుడిగా డైరెక్షన్ ఇస్తుంటే, లోకేష్ ఉత్తర కుమారుడిలాగా మాస్టర్ ప్లాన్ వేశారన్నారు. గతంలో లోకేష్ బాగోతాలు, స్మిమ్మింగ్‌ఫూల్ ఫొటోలను వాళ్లే బయట పెట్టుకున్నారని తెలిపారు. మహిళల పట్ల వాళ్ల నీచ సంస్కృతి ప్రజలకు తెలిసిపోతుందనే భయంతోనే నారీ సంకల్ప దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఫలానా మంచి చేశానని చెప్పుకోలేని దుస్థితిలో బాబు ఉన్నారన్నారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాల్లాంటివి ఒక్కటైనా చంద్రబాబు అమలు చేశారా? 31 లక్షల ఇళ్లు ఇచ్చారా? అని నిలదీశారు. అధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment