సాధికార యాత్రలో ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వైఎస్సార్‌సీపీ నాయకులు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎచ్చెర్ల ప్రజలు సామాజిక సాధికారతను ఎలుగెత్తి చాటారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన అండదండలతో సాధించిన అభివృద్ధిని వివరిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నియోజకవర్గమంతా కలియదిరిగారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార యాత్ర ఆద్యంతం పండుగ వాతావరణంలో జరిగింది.
రణస్థలం నుంచి చిలకపాలెం – పొందూరు రోడ్డు వరకు 15 కిలోమీటర్లు సాగిన బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పట్టారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై జగన్ అంటూ యువత నినాదాలతో హోరెత్తించారు. నియోజకవర్గంలోని రణస్థలం, లావేరు, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాల నుంచి బడుగు, బలహీన వర్గాల ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. అనంతరం చిలకపాలెంలో జరిగిన బహిరంగ సభకు ఇసకేస్తే రాలనంతగా ప్రజలు హాజరయ్యారు.
అన్ని కులాలకు సమాన హక్కులు కల్పింస్తున్న సీఎం జగన్: స్పీకర్ తమ్మినేని సీతారాం
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే రాష్ట్రంలో అన్ని కులాలకు సమాన హక్కులు కల్పిస్తున్నారని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వంటి కులాలకు జరుగుతున్న అన్యాయాలను గుర్తించి, వారికి రాజ్యాధికారాన్ని, సంపదను అందిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లను, 700 మంది డైరెక్టర్లను నియమించారన్నారు. అనేక పథకాలు, అంతర్జాతీయ స్థాయి విద్య, అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారని వివరించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. కరోనా సమయంలో గుజరాత్‌కు వలస వెళ్లిన 4,500 మంది మత్స్యకారులను ప్రత్యేక బస్సుల్లో సురక్షితంగా జిల్లాకు తెచ్చామని, 24 మంది మత్స్యకారులను పాకిస్థాన్ నుంచి విడిపించామని చెప్పారు. బీసీలు జడ్జీలుగా ఉండకూడదని కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాసిన ఘనత చంద్రబాబుదన్నారు. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలను అవహేళన చేసిన చంద్రబాబుకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ అప్పట్లో చంద్రబాబు పాలనను ఎందుకు విమర్శించలేదని ప్రశ్నించారు.
జగనన్న బలం చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. దేశానికి సచివాల య, వలంటీర్ వ్యవస్థలు ఆదర్శంగా నిలిచాయన్నారు.తన పని తీరు నచ్చితేనే ఓటు వేయమని అడగగలిగే ఏకైక సీఎం వైఎస్ జగన్ అని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ అన్నారు.
సీఎం జగన్ అన్ని కులాలకు న్యాయం జరిగేలా ఉప ముఖ్యమంత్రులు, మంత్రి పదవులు, నామినేటెడ్ పదవులను ఇచ్చారని తెలిపారు. సీఎం జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశ చరిత్రలో ఎన్నడూ లేవని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్ తెలిపారు. కులం, మతం, ప్రాంతం, లంచం, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ప్రయోజనాలు అందాయన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలు మాత్రమే అసంతృప్తిగా ఉన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యేలు కంబాల జోగులు, రెడ్డి శాంతి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, ఎమ్మెల్సీలు దువ్వాడ శ్రీనివాస్, వరుదు కల్యాణి, నర్తు రామారావు, పెనుమత్స సురేష్బాబు, జెడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల జీవన ప్రమాణాలు పెంచారు: మంత్రి ధర్మాన
సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. సీఎం జగన్ విశాఖను రాజధాని చేయాలనుకుంటుంటే టీడీపీ మాత్రం అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని విమర్శించారు. విశాఖను రాజధాని చేస్తే ఇక్కడ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment