వైఎస్సార్‌సీపీ పాలనలోనే సాధికారత | YSRCP Samajika Sadhikara Bus Yatra Started in Tenali | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ పాలనలోనే సాధికారత

Published Fri, Oct 27 2023 5:47 AM | Last Updated on Fri, Oct 27 2023 5:47 AM

YSRCP Samajika Sadhikara Bus Yatra Started in Tenali - Sakshi

తెనాలిలో సామాజిక సాధికార యాత్రలో మంత్రులు, ఎమ్మెల్యేలు తదితరులు 

తెనాలి (పట్నంబజారు): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుల, మత, ప్రాంత, రాజకీయ పక్షపాతం లేకుండా ప్రతి పేదవాడి ఇంటి ముంగిటకు సంక్షేమాన్ని తీసుకెళ్లారని మంత్రులు ఆది­మూ­లపు సురేష్, జోగి రమేష్‌ చెప్పారు. వైఎస్సార్‌­సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం తెనాలిలో జరిగిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడారు. గత ప్రభుత్వ పాలనలో కులాల మధ్య చిచ్చు పెట్టారని, కేవలం ఒక సామాజిక వర్గం, జన్మభూమి కమిటీలు నిర్ణయించిన వారికే పాలన అందించారని మంత్రి సురేష్‌ తెలిపారు.

అణగారిన వర్గాలు, బడుగు, బలహీన వర్గాల పేదలకు పరిపాలనను చేరువ చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై ఎన్ని దాడులు చేసిందో అందరికీ అనుభవమేనన్నారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు చేపట్టాక అసమానతలు లేని సమా­జాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు. జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతి లేని పాలన, సమర్థవంతమైన నాయకత్వం నాలుగు స్థంభాలుగా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నా­రన్నారు.

70 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సాధికారత కల్పించారని తెలిపారు. సామాజిక సాధికారత కోసం తాము యాత్ర చేస్తుంటే రిమాండ్‌ ఖైదీ కోసం భువనేశ్వరి యాత్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌సీపీ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల పక్షపాత పార్టీ అని మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. నాలుగున్నరేళ్ల పాలనలో చేసింది చెప్పేందుకే సామాజిక సాధికార యాత్రను చేస్తున్న దమ్మున్న నేత సీఎం జగన్‌ అని అన్నారు. ఇప్పటివరకు రూ.2.31 లక్షల కోట్లు ప్రజల కోసం ఖర్చుపెట్టిన ఘనత సీఎం జగన్‌దే అని అన్నారు.

2019లో ఓటు వేయని వారు కూడా వైఎస్‌ జగన్‌ పరిపాలన చూసి 2024లో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో 175 సీట్లకు 175 సీట్లను గెలవబోతున్నా­మని ధీమా వ్యక్తంచేశారు. సినిమాల్లో హీరోగా ఉండే వ్యక్తి రాజకీయాల్లో కామెడీ యాక్టర్‌గా మారిపో­యారని పవన్‌ కళ్యాణ్‌ను ఉద్దేశించి విమర్శించారు.

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ను తట్టుకోలేక టీడీపీ, జనసేన భూస్థాపితం కావడం తథ్యమన్నారు. సచివాల­యాలు, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే పాలన చేర్చిన ఘనత సీఎం జగన్‌కు దక్కుతుందన్నారు. రాష్ట్రంలో జగనన్న రావడానికి ముందు అన్నీ స్కామ్‌లేనని, జగనన్న వచ్చాక అన్నీ స్కీములేనని, ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. టీడీపీ మైనార్టీలకు చేసింది ఏమిలేదని చెప్పారు.

మాయమాటలతో బీసీల ఓట్లు వేయించుకునే రాజకీయాలకు సీఎం వైఎస్‌ జగన్‌ చెల్లు చీటి రాశారని ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి చెప్పారు. జన్మభూమి అనే పనికిమాలిన కమిటీల ద్వారా టీడీపీ సిగ్గుమాలిన పాలన చేసిందని, అందుకు భిన్నంగా పరిపాలన అంటే ఎలా ఉండాలో చూపించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అన్నారు. వైఎస్‌ జగన్‌ పాలనలో సామాజిక న్యాయం జరిగిందని, ఇంకా చేస్తానని ఆయన స్పష్టంగా చెబుతు­న్నారని పార్టీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవ­ర­ప్రసాద్‌ చెప్పారు.

పేదవారి కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అంబేడ్కర్‌ భావజాలాన్ని, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలను సీఎం జగన్‌ ముందుకు తీసుకెళ్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. సీఎం జగన్‌ బీసీ సాధికారతను చేతల్లో చూపించారని మాజీ ఎంపీ బుట్ట రేణుక తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆశీస్సులతో రూ.1,800 కోట్ల తో సంక్షేమం, అబివృద్ధి పనులు చేసినట్లు ఎమ్మెల్యే అన్నాబత్తుని చెప్పారు. దేశ చరిత్రలో 30 లక్షల మందికి ఇళ్ళ స్థలాలు ఇచ్చిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ఎంపీ ఆళ్ళ అయో­ధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మె­ల్యేలు రోశయ్య, షేక్‌ మహ్మాద్‌ ముస్తాఫా, జెడ్పీ చైర్‌పర్సన్‌  హెన్రీ క్రిస్టినా పాల్గొన్నారు. 

సామాజిక సాధికార రణభేరి ఇది
తెనాలి: దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ సీఎం చేయని విధంగా రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌  సామా జిక న్యాయాన్ని నెలకొల్పారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ చెప్పారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలంతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తలెత్తుకొని తిరిగేలా చేశారని తెలిపారు. కులాలు, మతాలు, పార్టీలు, జెండాలు, అజెండాలు లేకుండా అందరం మనసున్న జగనన్న బాటలోనే నడుస్తామని చెప్పారు.

ఇది సామాజిక సాధికార రణభేరి అని, సీఎం వైఎస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మంచి జరిగింది కాబట్టే, సీఎం వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించమని కోరుతున్నామని అన్నారు. వైఎస్సార్‌సీపీ  చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం తెనాలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ నేతృత్వంలో ప్రారంభమైంది. కొలకలూరు బాపయ్యపేట వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పార్టీ వర్గాలు ఘనంగా స్వాగతం పలికాయి. అక్కడే కుండల తయారీలో ఉన్న శాలివాహనులను పలకరించిన అనంతరం మంత్రులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

వికేంద్రీకరణ మంత్రంతో గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో 3.5 కోట్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు సాధికారత చేకూరిన విధానాన్ని ప్రజలకు వివరించి, వైఎస్‌ జగన్‌ను ఆశీర్వదించాలని ప్రజలను ధైర్యంగా కోరతామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, ముస్తాఫా, కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీలు పోతుల సునీత, కల్పలతారెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement