విప్లవాన్ని వివరిద్దాం.. రేపటి నుంచి వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర | YSRCP Samajika Sadhikaratha Bus Yatra in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

విప్లవాన్ని వివరిద్దాం.. రేపటి నుంచి వైఎస్సార్‌సీపీ బస్సు యాత్ర

Published Wed, Oct 25 2023 4:05 AM | Last Updated on Wed, Oct 25 2023 10:03 AM

YSRCP Samajika Sadhikaratha Bus Yatra in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ సీపీ ‘సామాజిక సాధికార యాత్ర’ గురువారం ఉత్తరాంధ్రలో ఇచ్ఛాపురం, కోస్తాలో తెనాలి, రాయలసీమలోని శింగనమల నియోజకవర్గాల్లో ఒకేసారి ప్రారంభం కాబోతోంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ రోజుకు ఒక్కో నియోజకవర్గం చొప్పున యాత్ర కొనసాగుతుంది. యాత్రలో భాగంగా ఆ నియోజకవర్గంలో సభనూ నిర్వహిస్తారు. 

అంటే రోజూ మూడు ప్రాంతాల్లో మూడు సభలు. స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త సారధ్యంలో ఈ యాత్ర జరుగుతుంది. రాష్ట్రంతోపాటు ఆ నియోజకవర్గంలో సంక్షేమాభివృద్ధి పథకాలు, పదవుల పంపకంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేసిన ప్రయోజనాన్ని ఈ యాత్ర ద్వారా ఆయా వర్గాలకు చెందిన మంత్రులు, వైఎస్సార్‌సీపీ నేతలు వివరిస్తారు.

గత ప్రభుత్వ హయాంలో సంక్షేమాభివృద్ధి పథకాలు, పదవుల పంపకంలో చంద్రబాబు చేసిన సామాజిక ద్రోహాన్ని.. టీడీపీ సర్కార్‌ అవినీతి, అక్రమాలు, దాషీ్టకాలను ప్రజలకు గుర్తు చేస్తారు. సీఎం వైఎస్‌ జగన్‌ పేదల పక్షాన నిలిస్తే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్, ఎల్లో మీడియాతో జట్టుకట్టి పెత్తందారీ వ్యవస్థకు దన్నుగా ఎలా నిలుస్తున్నారన్నది చూపిస్తారు.

పేదల పక్షాన నిలిచిన సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీని గెలిపించాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరిస్తారు. వైఎస్సార్సీపీ గెలిచిన నాటి నుంచీ రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాలుగు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఈనెల 9న విజయవాడలో నిర్వహించిన వైఎస్సార్‌సీపీ ప్రతినిధుల సభలో సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పారు. ఆ నాలుగింట్లో.. గురువారం నుంచి డిసెంబరు 31 వరకు జరిగే ఈ యాత్ర ఒకటి.  

ఇదీ... సామాజిక న్యాయం అంటే 
సామాజిక న్యాయంలో వైఎస్‌ జగన్‌ దార్శనికతను ఇపుడు దేశం మొత్తం ప్రశంసిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంక్షేమ పథకాలతో ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నుంచి గట్టెక్కించడం ద్వారా ఆర్థిక సాధికారత.. అమ్మ ఒడి, విద్యాదీవెన వంటి పథకాలతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్డడం ద్వారా విద్యా సాధికారత.. నామినేటెడ్‌ నుంచి కేబినెట్‌ వరకూ సింహభాగం పదవులు ఇచ్చి పరిపాలనలో భాగస్వామ్యం ఇవ్వడం ద్వారా రాజకీయ సాధికారత.. సంక్షేమ పథకాల నుంచి పదవుల వరకూ మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా మహిళా సాధికారతకు కృషి చేస్తుండటాన్ని సామాజిక వేత్తలూ ప్రశంసిస్తున్నారు.  

► సామాజిక న్యాయమనేది తమ నినాదం కాదని, తమ విధానమని నిరూపిస్తున్న వైఎస్‌ జగన్‌... ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95 శాతాన్ని అమలు చేసి చూపించారు. ఇప్పటిదాకా 99.5 శాతం హామీలను అమలు చేసి... దేశ చరిత్రలోనే ఎన్నికల మేనిఫెస్టోకు కొత్త నిర్వచనం ఇచ్చారు.  

► సంక్షేమ పథకాల కింద... ఒక్క పైసా అవినీతికి తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇప్పటిదాకా రూ.2.38 లక్షల కోట్లను జమ చేశారు. ఇందులో 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చేరాయి. నగదు బదిలీ కాకుండా ఇతర పథకాల ద్వారా రూ.2.33 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు.
 
► నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌కు ధీటుగా అభివృద్ధి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. పేద పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా ఇంగ్లీషు మీడియం భోదనను ప్రవేశపెట్టారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు విద్యా సాధికారత సాధించడానికి మార్గం సుగమం చేశారు. 

► వైఎస్సార్‌ ఆసరా, చేయూత వంటి పథకాల ద్వారా ఆర్థికంగా తోడ్పాటును అందించి.. కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ వరకూ పదవుల్లో మహిళలకు పెద్దపీట వేసి మహిళా సాధికారతకు మార్గం వేశారు.  

రాజ్యాధికారంలో సింహభాగం వారికే... 
► 2019 ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి.. 151 శాసనసభ స్థానాలు (86.28 శాతం), 22 లోక్‌సభ స్థానాల్లో (88 శాతం) వైఎస్సార్‌సీపీ విజయ ఢంకా మోగించింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్‌... తొలి మంత్రివర్గం నుంచే సామాజిక విప్లవానికి శ్రీకారం చుట్టారు. 25 మందితో ఏర్పాటు చేసిన కేబినెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన 14 మందికి (56 శాతం) స్థానం కల్పించారు. రాజ్యాధికారంలో సింహభాగం వాటా ఇచ్చారు. 

► ఐదుగురు డెప్యూటీ సీఎంలను నియమిస్తే.. అందులో నలుగురిని (80 శాతం) ఆ వర్గాల నుంచే నియమించారు. 

► శాసనసభ స్పీకర్‌గా బీసీ వర్గాలకు చెందిన తమ్మినేని సీతారం, శాసనమండలి ఛైర్మన్‌గా రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా ఎస్సీ వర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌ రాజు, మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన మహిళ జకియా ఖానంకు అవకాశమిచ్చారు.  

► 2022, ఏప్రిల్‌ 11న పునర్‌వ్యవస్థీకరణ ద్వారా 25 మందితో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో సామాజిక న్యాయం చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మరో అడుగు ముందుకేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారికి ఏకంగా 17 మందికి (70 శాతం) మంత్రివర్గంలో స్థానం కల్పించారు.  

► టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాజ్యసభకు బీసీ వర్గానికి చెందిన ఒక్కరిని కూడా పంపించలేదు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర కోటాలో 8 స్థానాలు ఖాళీ అయితే.. అందులో నలుగురు బీసీలను (50 శాతం) సీఎం వైఎస్‌ జగన్‌ రాజ్యసభకు పంపారు.  

►  ఇక శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి 43 మంది ఎమ్మెల్సీలు ఉంటే.. ఇందులో 29 మంది(68 శాతం) బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారే. 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీకి 48 ఎమ్మెల్సీ స్థానాలు దక్కితే.. అందులో కేవలం 18 పదవులు (37 శాతం) మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికిచ్చారు చంద్రబాబు.

ఏమీ చెయ్యకుండా కూడా మీడియా బలంతో చెలామణి అయిన చంద్రబాబుకు అసలు సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కుందా? రాజ్యాధికారంలో.. పరిపాలనలో సింహభాగం వాటా ఇవ్వడం ద్వారా తన చిత్తశుద్ధితో సామాజిక న్యాయానికి కొత్త అర్థం చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌తో బాబుకు పోలికెక్కడ? 

స్థానిక సంస్థల్లోనూ సామాజిక సాధికారత.. 
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం వైఎస్‌ జగన్‌ ఉత్తర్వులు జారీ చేస్తే.. దానిపై హైకోర్టులో టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారు. దాంతో బీసీలకు రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గాయి. టీడీపీ కుట్రలు చేసిన రిజర్వేషన్లు తగ్గించినా.. పార్టీపరంగా 34 శాతం కంటే ఎక్కువే ఇస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఆ మేరకే స్థానిక సంస్థలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి సింహభాగం పదవులిచ్చారు. 

► రాష్ట్రంలో 648 మండలాలకు ఎన్నికలు జరిగితే... 637 మండలాల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించింది. ఇందులో 237 మండల పరిషత్‌ అధ్యక్ష పదవులను బీసీలకు(38 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి ఎంపీపీ పదవుల్లో 67 శాతం ఇచ్చారు. 

► 13 జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ పదవులలో ఒక్క బీసీలకే 6 (46 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి ఏకంగా 9 జడ్పీ ఛైర్మన్‌ పదవులు(69 శాతం) ఇచ్చారు. 

► రాష్ట్రంలో 14 మున్సిపల్‌ కార్పొరేషన్లలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. 14 మేయర్‌ పదవుల్లో బీసీలకు ఏకంగా 9 పదవులు (64 శాతం) ఇచ్చారు సీఎం వైఎస్‌ జగన్‌. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుంటే 14 కార్పొరేషన్‌ మేయర్‌ పదవులకుగానూ 12 పదవులు (86 శాతం) వారికే ఇచ్చారు.  

► 87 మున్సిపాల్టీలలో ఎన్నికలు జరిగితే.. అందులో 84 మున్సిపాల్టీలలో వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ఇందులో 44 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులను బీసీలకు(53 శాతం) ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలవర్గాలకు కలిపి 58 మున్సిపల్‌ ఛైర్మన్‌ పదవులు(69 శాతం) ఇచ్చారు. 

చట్టం చేసి మరీ నామినేటెడ్‌ పదవులు..: 
నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారికి రిజర్వేషన్‌ చేస్తూ చట్టం చేసి మరీ ఆ వర్గాలకు పదవులిచ్చారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం ఆ వర్గాలకు రిజర్వేషన్‌ చేస్తూ చట్టం చేయడం దేశంలో ఇదే తొలిసారి.  

► 196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లను నియమిస్తే... అందులో బీసీలకు 76 పదవులు (39 శాతం) ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కలిపి  117 పదవులు(60 శాతం) ఇచ్చారు. 

► వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 ఛైర్మన్‌ పదవులలో 53 పదవులు (39శాతం) బీసీలకే ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 137 పదవుల్లో 79 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు. 

► 137 ప్రభుత్వ కార్పొరేషన్‌ పదవులకు సంబంధించి... 484 నామినేటెడ్‌ డైరెక్టర్‌ పదవులుంటే అందులో 201 పదవులు బీసీలకు(41 శాతం) ఇచ్చారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కలుపుకుంటే 484 పదవుల్లో 280 పదవులు(58 శాతం) ఆ వర్గాలకే ఇచ్చారు.  

► బీసీ వర్గాలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు ప్రత్యేకంగా 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు 1 కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి.. వాటికి ఆ వర్గాల వారినే ఛైర్మన్లుగా నియమించారు. ఆ కార్పొరేషన్లలో ఆయా వర్గాలకు 684 డైరెక్టర్‌ పదవులూ ఇచ్చారు. ఆలయ బోర్టులు, ఆలయ ఛైర్మన్‌ పదవుల్లో సగ భాగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. దాదాపుగా 7,006 ఆలయ బోర్డు మెంబర్ల పదవుల్లో 3,503... అంటే సగం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకే ఇచ్చారు. 

► రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిననాటి నుంచీ ఇప్పటిదాకా 4 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తే... అందులో గతన 53 నెలల్లో భర్తీ చేసినవే 2.07 లక్షలు. సగానికన్నా ఎక్కువైన ఈ ఉద్యోగాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకే 80 శాతం దక్కాయి. అదీ.. సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇస్తున్న విలువ.  

ఒకరేమో ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ ఆ వర్గాన్ని హేళన చేసే నాయకుడు. మరొకరేమో ఆ వర్గానికి ఉప ముఖ్యమంత్రి, శాసనమండలి ఛైర్మన్‌.. రాష్ట్ర హోంమంత్రి వంటి పదవులిచ్చి గౌరవించిన నేత.  

ఒకరేమో న్యాయం చేయాలని అభ్యర్ధించిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తరిస్తానంటూ.. మత్స్యకారులను తోలుతిస్తానంటూ బెదిరించిన నాయకుడు. మరొకరేమో కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ వరకూ పదవుల్లో, సంక్షేమాభివృద్ధి పథకాల్లో సింహభాగం బీసీలకే ఇచ్చిన నేత.
 
ఇదే... మౌలికంగా చంద్రబాబు నాయుడికి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఉన్న తేడా. అసలు ఎస్సీలను హేళన చేసి, బీసీలను బెదిరించి తన సామాజిక వర్గానికే, తన లాబీయిస్టులకే రాజ్యసభ పదవుల్లో అగ్రభాగం కట్టబెట్టిన చంద్రబాబుకు.... అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌సీపీకి దక్కిన రాజ్యసభ పదవుల్లో 50 శాతాన్ని బీసీలకే ఇచ్చిన జగన్‌తో పోలికే లేదు.

బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు రాష్ట్రానికి వెన్నెముక అంటూ చాటిచెప్పిన జగన్‌కు దరిదాపుల్లో కూడా లేని నాయకుడు చంద్రబాబు. అలాంటి చంద్రబాబు సైతం తనకున్న మీడియా బలంతో అన్నివర్గాలకూ న్యాయం చేస్తున్నట్లుగా కొన్నాళ్లు చెలామణి కాగలిగారు. కాకపోతే రోజులు మారి.. ఎప్పటికప్పుడు జనాలకు నిజాలు తెలుస్తున్నాయి.  

ఇదిగో... ఇలా వాస్తవాలు వివరించే క్రమంలోనే గత 53 నెలలుగా సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న సామాజిక న్యాయాన్ని.. 2014–19 మధ్య చంద్రబాబు చేసిన సామాజిక ద్రోహాన్ని ప్రజల ముందు పెట్టడానికి ‘సామాజిక సాధికారత యాత్ర’ మొదలు కాబోతోంది. గురువారం నుంచి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ఒకే సారి వైస్సార్‌ సీపీ ఈ బస్సుయాత్రకు శ్రీకారం చుడుతోంది. 

చంద్రబాబుకు ఎన్నికల ముందు మాత్రమే జనం కనిపిస్తారు. అందుకే ఆయన శంకుస్థాపనలు చేసినా, పదవులిచ్చినా, జీవోలిచ్చినా అన్నీ ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు మాత్రమే జరుగుతాయి. అది కూడా కొన్ని కాగితాలపైనే!!. 2014లో గెలిచిన చంద్రబాబు... 2019 ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే ఎస్టీకి తన కేబినెట్లో స్థానమిచ్చారు. గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేసిందీ అప్పుడే.

గత ఎన్నికలకు రెండునెలల ముందు వరకూ ముస్లింలకు సైతం చంద్రబాబు కేబినెట్లో స్థానం లేదు. కానీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రభుత్వం ఏర్పాటవుతూనే ఎస్టీలకు ఉపముఖ్యమంత్రి స్థానాన్నిచ్చారు. ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని సైతం ఉప ముఖ్యమంత్రిని చేయటంతో పాటు ముస్లిం మహిళను శాసనమండలి ఛైర్‌పర్సన్‌గా నియమించారు.

సంక్షేమాభివృద్ధి పథకాల నుంచి కేబినెట్‌–నామినేటెడ్‌ వరకూ ఆ వర్గాలకు పెద్దపీట వేశారు. అంతేకాదు!! కోడలు మగ పిల్లాణ్ణి కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ మహిళల పుట్టుకనే హేళన చేసింది చంద్రబాబయితే... హోంమంత్రిగా, శాసనమండలి ఛైర్‌పర్సన్‌గా మహిళలను నియమించడమే కాక కేబినెట్‌ నుంచి నామినేటెడ్‌ వరకూ వారికి సింహభాగం పదవులిచ్చి, ఆసరా, చేయూత వంటి పథకాలతో ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్నది వైఎస్‌ జగన్‌. సామాజిక న్యాయంలో వీళ్లకసలు పోలిక ఉందా?    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement