కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయిషా
ప్రొద్దుటూరు క్రైం: వారిది చిన్న కుటుంబం.. భార్యా భర్తలు పని చేసుకొని జీవనం సాగించేవారు. ఏడాది వయస్సు గల పాపతో వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. సంతోషాలకు నిలయమైన ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. కుమార్తెను చంకనెత్తుకున్న ఆ తల్లి కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఈ సంఘటన ప్రొద్దుటూరులోని మోడంపల్లెలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు.. నాసిర్ మైదుకూరు రోడ్డులోని ఒక సూపర్‌మార్కెట్‌లో పని చేస్తున్నాడు. అతనికి రెండేళ్ల క్రితం అనంతపురానికి చెందిన ఆయిషాతో వివాహం అయింది. వారికి 13 నెలల అలీషా అనే కుమార్తె ఉంది. పెళ్లి అయిన నాటి నుంచి భార్యా భర్తలు అన్యోన్యంగా ఉండేవారు.
ఈ క్రమంలో గురువారం రాత్రి నసీర్ సూపర్‌మార్కెట్ నుంచి ఇంటికి వచ్చాడు. భోజనం తిన్న తర్వాత భార్యాభర్తలు పడుకున్నారు. కొంత సేపటి తర్వాత ఆయిషా తన కుమార్తెను ఎత్తుకొని మొదటి అంతస్తునున్న గదిలోకి వెళ్లింది. అక్కడే ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి మంటలు రావడంతో భర్త గట్టిగా కేకలు వేశాడు. స్థానికుల సహకారంతో భార్యా, కుమార్తెలను జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యుడు వారి పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్‌కు తరలించారు. అయితే కొద్ది సేపటి తర్వాత ఆలీషా (13 నెలలు) మృతి చెందింది. ఆయిషా శరీరం కూడా పూర్తిగా కాలిపోయింది. ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
సంఘటన జరిగిన వెంటనే భర్త నాసిర్‌ను టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనపై అతన్ని ప్రశ్నించారు. తన భార్య ఎందుకు ఇలా చేసిందో తెలియదని చెబుతున్నాడు. తమకు ఎలాంటి సమస్యలు లేవని, గొడవలు కూడా తమ మధ్య ఉండేవి కావని అతను పోలీసులకు తెలిపాడు. కాగా పోలీసులు నాసిర్ నివాసం ఉంటున్న మోడంపల్లెకు వెళ్లి విచారించారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేవారని చెప్పారు. నాసిర్‌ను చాలా ఏళ్ల చూస్తున్నామని, మంచివ్యక్తి అని వారు పోలీసులతో అన్నారు. రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయిషా తన భర్త దేవుడు లాంటి వాడని పోలీసులకు తెలిపింది. తనను ఏమీ అనొద్దని, అతను మంచివాడని చెప్పింది. అనంతపురంలో ఉన్న ఆయిషా తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన ఎందుకు జరిగిందో అర్థం కాక పోలీసులు సతమతమవుతున్నారు. టూ టౌన్ సీఐ ఇబ్రహీం శుక్రవారం ఉదయం రిమ్స్‌కు వెళ్లి పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment