అన్నమయ్య: వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ఇద్దరు ప్రియుళ్లతో కలిసి పక్కా పథకంతో భర్తను, భార్య అంతమొందించింది. మంగళవారం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ మహబూబ్‌బాషాతో కలిసి డీఎస్పీ కేశప్ప మీడియాకు హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కలకడ మండలం సింగనొడ్డిపల్లెకు చెందిన దాదినేని వెంకటశివ(45), రమణమ్మ(40) భార్యాభర్తలు. వీరి కుమార్తెకు వివాహం చేసిన తర్వాత దంపతులిద్దరూ ఏడాది క్రితం మదనపల్లెకు వచ్చి నీరుగట్టువారిపల్లెలో అద్దె ఇంట్లో ఉంటూ టమాటా మార్కెట్‌యార్డులో పనిచేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో భార్య రమణమ్మ టమాటా మార్కెట్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న బసినికొండకు చెందిన షేక్ బషీర్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అతడితో పాటుగా తమ ఇంటిపక్కన ఉన్న గంగాధర్ అలియాస్ గగన్(21)తోనూ వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది. ఇంటి ముందు చెత్తవేస్తూ, పరిసరాలు అపరిశుభ్రంగా చేస్తున్నారని గగన్ అక్క ముంతల బిందుప్రియ(25) మృతుడు వెంకటశివతో కొంతకాలం క్రితం గొడవ పెట్టుకుంది. అప్పుడు వెంకటశివ పరుషంగా మాట్లాడటంతో అతడిపై వ్యక్తిగతంగా కక్ష పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రమణమ్మతో వివాహేతర సంబంధం పెట్టుకున్న డ్రైవర్ షేక్‌బషీర్ ఇంటికి వచ్చివెళుతూ, వెంకటశివతో పక్కింటివారికున్న తగాదాను తెలుసుకున్నాడు. రమణమ్మతో తన సంబంధం సజావుగా సాగాలంటే వెంకటశివను అంతమొందించాలని భావించి పక్కింటి వారైన గగన్, బిందుప్రియతో కలిసి పథకం రచించాడు.
వెంకటశివను చంపితే రూ.25,000 డబ్బులు ఇస్తానని వారికి ఆశ చూపాడు. దీంతో వారు వారం ముందే వెంకటశివను చంపేందుకు నిర్ణయించుకుని మద్యం తాగించారు. అయితే అనుకున్నట్లు జరగకపోవడంతో పథకం వాయిదావేశారు. ఈ క్రమంలో గత నెల 29న అతిగా మద్యం సేవించిన వెంకటశివ మత్తులో తూలుతూ ఇంటి ముందర పడిపోవడంతో తలకు గాయమైంది. భర్త తలకు గాయమై, స్పృహలో లేకపోవడాన్ని గమనించిన భార్య రమణమ్మ అప్పటికప్పుడు గగన్, బిందుప్రియలకు హత్య చేసేందుకు ఇదే సరైన సమయంగా చెప్పి రావాలని కోరింది. సింగనొడ్డుపల్లెలోని వెంకటశివ తల్లికి ఫోన్‌చేసి భర్త తాగి ఇంటి ముందు పడిపోవడంతో తలకు గాయమైనట్లు చెప్పింది. ఆమె మీ ఖర్మ.
మీ బాధలు మీరే పడండని చెప్పడంతో రమణమ్మ రోకలిబడితో వెంకటశివకు తలపై గాయమైన చోట కొట్టగా, గగన్ ఉరితాడు తీసుకుని వెంకటశివ గొంతు కింద బలంగా పట్టుకున్నాడు. బిందుప్రియ నోరుమూసిపట్టుకుంది. రమణమ్మ తన భర్త కాళ్లు పట్టుకోవడంతో వెంకటశివ ఊపిరాడక చనిపోయాడు. తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా రమణమ్మ తమకు బంధువైన ఆటో డ్రైవర్ రవిని పిలిచి, మరణించిన తన భర్తను సింగనొడ్డుపల్లెకు తీసుకువెళ్లాల్సిందిగా కోరింది. అక్కడకు వెళ్లాక వెంకటశివ అన్న తన తమ్ముడు తాగి కిందపడి తలకు గాయమైతే, మెడపై తాడుతో ఉరివేసిన చారలు ఎందుకు ఉన్నాయని అనుమానంతో ప్రశ్నించాడు.
రమణమ్మ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అనుమానంతో కలకడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మదనపల్లె వన్‌టౌన్ పోలీసులకు తెలపడంతో రమణమ్మ, గగన్‌లను అదుపులోకి తీసుకుని విచారించడంతో అసలు కథ బయటపడిందన్నారు. దీంతో హత్యలో పాల్గొన్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ప్రధాన సూత్రధారి అయిన లారీ డ్రైవర్ షేక్‌బషీర్ లోడు వేసుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో, త్వరలో అతడిని అరెస్ట్ చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment