వివాహేతర సంబంధం ఓ పసికందు ప్రాణం తీసింది. పైశాచికంగా ఒకడు పిడిగుద్దులు కురిపిస్తే అల్లాడిన మూడేళ్ల చిన్నారి తనువు చాలించాడు. నవ మాసాలు మోసి పెంచిన తల్లి మానవత్వం మరచి ప్రియుడిపై మోజుతో తప్పుడు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకొంది. నీటి తొట్టెలో పడి చనిపోయాడని ఫిర్యాదు చేయగా... విచారించిన పోలీసులకు అసలు విషయం తెలిసింది.
మదనపల్లె : నీటి తొట్టెలో పడి బాలుడు మృతి చెందిన కేసును పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. తాలూకా సీఐ ఎన్.శేఖర్ వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం చెరుకువారిపల్లెకు చెందిన చిచ్చిలి శివశంకర్ రెడ్డి(33) స్థానిక బ్రాందీ షాపులో పనిచేస్తుండేవాడు. అదే గ్రామానికి చెందిన నాగరాజుతో స్నేహం ఏర్పడింది. తరచూ ఇంటికి వచ్చిన శివశంకర్‌రెడ్డి... కొద్ది రోజుల తర్వాత నాగరాజు భార్య మల్లకుంట్ల మయూరి(25)తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.
రెండేళ్ల తర్వాత తన ప్రియురాలు మయూరిని, ఆమె కుమారుడు హరన్‌సాకేత్(3)ను తీసుకుని గ్రామం వదలి ఉపాధి కోసం శివశంకర్‌రెడ్డి మదనపల్లెకు వచ్చారు. అక్కడే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో ఇద్దరికీ ఉద్యోగాలు దొరకడంతో చిప్పిలిలో ఉంటూ పని చేసేవారు. వారు ఉద్యోగానికి వెళ్లేటప్పుడు మూడేళ్ల చిన్నారిని ఇంట్లో ఉంచి సెల్‌ఫోన్ చేతికిచ్చి వెళ్లేవారు. సాయంత్రం వచ్చేటప్పటికి కుమారుడు మలమూత్రాలతో గలీజుగా ఉండడంతో ఇల్లును శుభ్రం చేసుకోవడం దినచర్యగా ఉండేది.
పిడి గుద్దులు కురిపించి....
ఈ ఏడాది ఫిబ్రవరి 13న శివశంకర్ రెడ్డి ఇంటి వద్ద ఉండగా, మయూరి ఉద్యోగానికి వెళ్లింది. చిన్నారి సాకేత్‌ను ఇంట్లో ఉంచారు. ఇంటి నుంచి బయటికి వెళ్లి శివశంకర్‌రెడ్డి రాగానే సాకేత్ మలమూత్రాలతో గలీజు చేయడంతో, పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతూ కనికరం లేకుండా పైశాచయికంగా పిడిగుద్దులు గుద్దాడు. బాలుడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతిచెందాడని చెప్పడంతో... తనను కాపాడాలని ప్రియురాలు మయూరిని వేడుకున్నాడు.
దీంతో ప్రియుడిపై ఉన్న మోజుతో, తల్లి ప్రేమను మరిచి బాలుడు ప్రమాదవశాత్తూ బకెట్‌లో పడి మృతిచెందినట్లు మయూరి తాలూకా పోలీసులో ఫిర్యాదు చేసింది. తల్లి ఫిర్యాదు మేరకు ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో బాలుడిని ఆవేశంలో చంపినట్లు శివశంకర్‌రెడ్డి నేరం అంగీకరించడంతో హత్య కేసుగా మార్పుచేసినేట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ సుబ్రహ్మణ్యం, హెడ్‌కానిస్టేబుల్ ప్రభాకర్, కానిస్టేబుళ్లు రాఘవ, శశికళ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment