కూటమి ప్రభుత్వంలో మహిళలపై పెరుగుతున్న దాడులు
మదనపల్లె: కూటమిప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై దాడులు, అఘాయిత్యాలు అధికమయ్యాయని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్ అన్నారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పీలేరు నియోజకవర్గం నడిమికండ్రిగ పంచాయతీ ప్యారంపల్లెలో గౌతమిపై జరిగిన యాసిడ్‌దాడిని ఖండించారు. మదనపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు సంకారపు మురళీ కుమారుడు గణేష్, పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆడబిడ్డ జీవితాన్ని నాశనం చేశాడన్నారు. ఇలాంటి ఘటనలు ఎవరు చేసినా నిందితులను కఠినంగా శిక్షించాలన్నారు. నిందితుడు టీడీపీ నాయకుడు కావడంతో బాధితురాలిని రాజీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందని, కూటమిప్రభుత్వంలో ఆడబిడ్డకు చేసే న్యాయం ఇదేనా అంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను ప్రశ్నిస్తున్నామన్నారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు, హత్యలు అరికట్టడంలో కూటమిప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మహిళల రక్షణ కోసం జగన్‌మోహన్‌రెడ్డి దిశ వ్యవస్థను తీసుకువచ్చారన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు స్పందించి రక్షణ కల్పించేలా ఏర్పాట్లు చేశారన్నారు. యాసిడ్ ఘటనలో ప్రేమోన్మాది దాడిలో బాధిత యువతికి ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించాలని, కుటుంబానికి అండగా నిలిచి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్.ఏ.కరీముల్లా, కౌన్సిలర్ ఈశ్వర్‌నాయక్, కొత్తపల్లె మహేష్, యూనస్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నిసార్‌అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment