అర్జీలపై నిర్లక్ష్యం వద్దు
సుండుపల్లి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) ద్వారా, రెవెన్యూ సదస్సుల్లో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలపై నిర్లక్ష్యం వీడి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సుండుపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన అర్జీల పరిష్కారం ప్రగతిపై తహసీల్దార్, ఆర్‌ఐ, మండల సర్వేయర్, వీఆర్‌ఓ, వీఆర్‌ఏలతో సమీక్షించారు. మండలంలో మొత్తంగా భూమి సమస్యలపై 506 దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తహసీల్దార్ దైవాధీనం కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా అర్జీల పరిష్కారంలో శ్రద్ధ చూపకుండా ప్రగతిలో వెనుకబడిన తిమ్మసముద్రం వీఆర్‌ఓ చిట్టిబాబు , గ్రామ సర్వేయర్ సుబ్బరాయుడు, జి. రెడ్డివారిపల్లి వీఆర్‌ఓ నరసింహులు, ముడుంపాడు వీఆర్‌ఓ హరీష్, బాగంపల్లి వీఆర్‌ఓ కొండయ్యలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లోగా ప్రగతి చూపకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన మొత్తం అర్జీలను నాణ్యతగా పరిష్కరించడమే అధికారుల లక్ష్యం కావాలని సూచించారు. క్షేత్ర స్థాయికి వెళితే భూసేకరణ, దారి సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయన్నారు. తర్వాత సుండుపల్లె–3 పరిధిలో కంచిపట్లవాండ్లపల్లె సమీపంలో ప్రభుత్వ భూమి ఆక్రమణను పరిశీలించారు. గ్రామస్తుల సౌకర్యం కోసం అదే ప్రాంతంలో స్మశాన వాటిక నిమిత్తం భూమి కేటాయింపునకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment