నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 17వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నేడు మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: మాఘమాసం పురస్కరించుకుని తంబళ్లపల్లె వద్ద ఉన్న ప్రముఖ శైవక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిఎం మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 5.30 గంటలకు, 6,30 గంటలకు మల్లయ్యకొండకు బస్సుల వెళతాయనన్నారు. అక్కడి నుంచి రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు.
హ్యాండ్ బాల్ జట్టు ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప నగరంలోని డీఎస్‌ఎ క్రీడా మైదానంలో ఆదివారం జిల్లా హ్యాండ్ బాల్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలను జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరి శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికయ్యే క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించాలన్నారు. అనంతరం జిల్లా జట్టుకు ఎంపికలు నిర్వహించారు.
సీమ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత శ్రీకాళహస్తి
రాజుపాళెం: రాయలసీమ స్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో శ్రీకాళహస్తి టీం విజేతగా నిలిచింది. మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని మండల కేంద్రమైన రాజుపాళెం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో రాజుపాళెం కిరణ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శని, ఆది వారాల్లో ఈ పోటీలను నిర్వహించారు. ఇందులో భాగంగా విజేత జట్టుకు రూ.15,016లను వీరశంకర్ అందజేశారు. అలాగే రన్నరప్‌గా నిలిచిన నంద్యాల జట్టుకు రూ.12,016 సుభద్రమ్మ్డ అందించగా, మూడవ బహుమతిగా పీలేరు జట్టుకు రూ.10.016 జయరామిరెడ్డి, నాల్గవ బహుమతిగా కోవెలకుంట్ల జట్టుకు 8,016 బాబుసాహెబ్, ఐదవ బహమతిగా రాజుపాళెం జట్టుకు రూ.5016లతో పాటు మెమెంటోలను లెక్షరల్ జయరాముడు అందించారు.
రామయ్యకు వెండి
కరకం బహూకరణ
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండరామస్వామికి ఆదివారం సికింద్రాబాద్‌కు చెందిన భక్తుడు వెండి కరకం(చెంబు) బహూకరించారు. సికింద్రాబాద్‌కు చెందిన ఉదయ భాస్కర్ రూ. 89వేలు విలువగల 700 గ్రాముల వెండి కరకాన్ని ఇచ్చారని ఆలయ అధికారులు చెప్పారు. ఆలయ అర్చకులు వీణా మనోజ్ కుమార్, పవన్ కుమార్‌లకు వారు కరకాన్ని అందజేశారు. ఈసందర్భంగా దాతలను ఆలయ అధికారులు సత్కరించారు. అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
కమనీయం..
రంగనాథుని కల్యాణం
పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని శ్రీరంగనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాథస్వామి కల్యణం అంగరంగ వైభవంగా జరిగింది. పండితుల వేదమంత్రాలు, మంగళ వాయి ద్యాల నడుమ కల్యాణ వైభోగం కన్నుల పండువగా సాగింది. ప్రధాన అర్చకులు కృష్ణరాజేష్ శర్మ ఆధ్వర్యంలో కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. సతీసమేతుడైన శ్రీరంగనాథుని ముగ్ధమోహన రూపాన్ని చూసి భక్తులు తరించారు. శాశ్వత కల్యాణ ఉభయదారులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంకు చెందిన చల్లా నారాయణస్వామి, ఉమాదేవి దంపతులు, కుటుంబ సభ్యులచే కళ్యాణం జరిపించారు. సాయంత్రం స్వామివారు సతీ సమేతుడై గజ వాహనంపై పట్టణ పురవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయకర్పూరాలను సమర్పించారు.
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
Comments
Please login to add a commentAdd a comment