అంగళ్లు బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
కురబలకోట : మండలంలోని అంగళ్లు బైపాస్ రోడ్డులో శుక్రవారం వేకువ జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిమెంట్ లారీ ఢీ కొనడంతో టెంపో డ్రైవర్ మనోహర్ (24) అక్కడికక్కడే మృతి చెందాడు. అంగళ్లు బైపాస్ రోడ్డుపై తొలి మరణం కూడా ఇదే. ముదివేడు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ కథనం మేరకు.. ములకలచెరువు మండలం సోంపల్లె గ్రామం రాయపువారిపల్లెకు చెందిన కె. మనోహర్ (24) టెంపో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వేకువ జామున టెంపోలో టమాటాలను మార్కెట్‌కు తీసుకెళ్లి అన్‌లోడింగ్ తర్వాత స్వగ్రామానికి బయలు దేరాడు. అంగళ్లు దగ్గర బైపాస్‌పై వస్తుండగా ఎదురుగా వచ్చిన సిమెంట్ లారీ వేగంగా టెంపోను ఢీకొంది. టెంపో ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. డ్రైవింగ్ సీట్లోనే మనోహర్ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఉత్తన్న అంధుడు. ఇతనికి కుమార్తె, కుమారుడు. జీవనాధారంగా ఉన్న కన్న పేగు మనోహర్ శాశ్వితంగా దూరమవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇదిలా ఉండగా ప్రమాదానికి కారణమైన సిమెంట్ లారీ రాంగ్ సైడ్‌లో వచ్చింది. దొమ్మన్నబావి–గోల్డన్ వ్యాలీ మార్గంలో పెండింగ్ పనులు జరుగుతుండడంతో ఫోర్‌వేలో ఒక రోడ్డును క్లోజ్ చేశారు. విధి లేని పరిస్థితిలో లారీ పక్క రోడ్డులో రావడంతో ప్రమాదానికి కారణమైందని భావిస్తున్నారు. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని వ్యక్తమవుతోంది.
లారీ ఢీకొని టెంపో డ్రైవర్ దుర్మరణం
కుమారుడు దూరమై తల్లిదండ్రుల వేదన
అంగళ్లు బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment