హార్సిలీ ఘాట్‌లో బైక్‌ ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

హార్సిలీ ఘాట్‌లో బైక్‌ ప్రమాదం

Published Mon, Feb 17 2025 1:42 AM | Last Updated on Mon, Feb 17 2025 1:42 AM

-

బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ పైనుంచి కిందకు వస్తున్న బైక్‌ ప్రమాదానికి గురికావడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలు. బైక్‌పై ఓ యువతి, యువకుడు హార్సిలీహిల్స్‌ వచ్చారు. కొండపై పర్యటన ముగించుకుని వెనుదిరిగారు. ప్రొద్దుటూరు మలుపు దాటుకున్న తర్వాత బైక్‌ ప్రమాదానికి గురైంది. అతివేగంతో వచ్చిన కారణంగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో యువతి, యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

బైరెటీస్‌ మిల్లులను

ఆదుకోండి

ఓబులవారిపల్లె : మంగంపేట గనుల ఆధారంగా ఏర్పాటు చేసుకున్న బైరెటీస్‌ మిల్లులను ఆదుకోవాలని, అందులో పనిచేస్తున్న కార్మికులను కాపాడాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ చంద్రశేఖర్‌, పోరాట కమిటీ కన్వీనర్‌ పి.జాన్‌ ప్రసాద్‌ కోరారు. ఆదివారం వారు విలేకరులతో మాట్లాడుతూ మంగంపేట గనుల్లో ముగ్గురాయి ఆధారితంగా స్థానికంగా 175 పల్వరైజింగ్‌ మిల్లులను ఏర్పాటు చేశారన్నారు. అందులో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేకమైన రాయితీలు కల్పించకుండా సి అండ్‌ డి గ్రేడ్‌ టన్ను రూ. 1680 ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు. ఎగుమతిదారులకు ధర తగ్గించి రూ. 1188 ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వం స్థానిక పల్వరైజింగ్‌ మిల్లులకు రూ. 500 ధర పెంచి ఇస్తానని చెప్పడం, ఒకరికి ఒక ధర ఇంకొకరికి మరో ధర ఇవ్వడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మిల్లులకు 40 శాతం, ఎగుమతి దారులకు 60 శాతం ముడి ఖనిజాన్ని సరఫరా చేసే విధంగా అప్పట్లో జీఓ నంబర్‌. 296 ఇచ్చారని, దానిని అమలు చేయాలని కోరారు.

ఆటోను ఢీ కొన్న ట్రాక్టర్‌

కమలాపురం : పట్టణ పరిధిలోని మార్కెట్‌ యార్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని జీవంపేటకు చెందిన షేక్‌ పీరా వలి తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీరావలి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి కమలాపురం పట్టణం నుంచి క్రాస్‌ రోడ్డుకు పీరా వలి తన ఆటో నడుపుతూ వస్తున్న క్రమంలో హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ దాటిన తర్వాత మార్కెట్‌ యార్డులో నుంచి వచ్చిన ట్రాక్టర్‌ ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో పీరావలి తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే ఆటో కూడా దెబ్బతిన్నది. స్థానికులు 108కు సమాచారం అందించగా వల్లూరు 108 వాహనం ద్వారా కడపలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : కడప నగరం సరోజినీ నగర్‌కు చెందిన వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు రిమ్స్‌ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు సరోజినీ నగర్‌లో నివాసం ఉంటున్న షేక్‌ షబ్బీర్‌(35) టైల్స్‌ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత కొన్ని సంవత్సరాలుగా మద్యానికి బానిసయ్యాడు. కూలి డబ్బులు ఇంట్లో ఇవ్వకుండా తాగుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో శనివారం అర్థరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య షకీలా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

విష ద్రావణం తాగి వృద్ధురాలు..

కడప నగరం సరోజిని నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు ఆదివారం విషద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు రిమ్స్‌ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement