రెవెన్యూ లీలలు ఇంతింత కాదయా.!
పెద్దతిప్పసముద్రం : మండలంలోని సంపతికోట పంచాయతీలో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ డీకేటీ భూములను ఇతరులకు కట్టబెట్టేశారు. పట్టాలు ఉండి సాగు చేస్తున్న హక్కుదారుల నోట్లో మట్టి కొట్టి కర్ణాటక రాష్ట్రంలో, పక్క మండలాల్లో ఉంటున్న వారి పేరిట డీకేటీ భూములు కట్టబెట్టారంటే అధికారులు ఎంతగా బరి తెగించారో ఇట్టే అర్థమౌతోంది. విషయం తెలుసుకున్న హక్కుదారులు లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. రూ.లక్షల్లో డబ్బులు తీసుకుని అధికారులు తమ భూములను ఇష్టారాజ్యంగా మార్పిడి చేశారని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా, సబ్ కలెక్టర్ ఆదేశాలను సైతం బే ఖాతర్ చేస్తూ అధికారులు మామూళ్లు తీసుకుని ఒకరి భూమిని మరొకరి పేరిట మార్చేశారని హక్కుదారులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులు ఒక్క సంపతికోట పంచాయతీలోనే వందల ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు తారుమారు చేసినట్లు తెలుస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు సమగ్రంగా రికార్డులు తనిఖీ చేస్తే అధికారుల అవినీతి బండారం బట్టబయలు అవుతుందని పంచాయతీ ప్రజలు పేర్కొంటున్నారు.
● ఇదే పంచాయతీలోని కానగమాకులపల్లికి చెందిన చిన్న వెంకట్రాయప్పరెడ్డి పేరిట సర్వే నంబర్ 459/1లో 4.25 ఎకరాల డీకేటీ భూమి ఉండగా ఆయనకు తెలియకుండా ఆయన బతికుండగానే అతని భార్య సిద్దమ్మ పేరిట భూ మార్పిడి ఎందుకు చేశారో అధికారులకే ఎరుక.
● వడ్డి కోనప్ప అనే వ్యక్తి పేరిట ఉన్న సర్వే నంబర్ 443/2లో 3.78 ఎకరాల డీకేటీ భూమి ఉండగా సదరు భూమి తన అనంతరం మనవరాలు కవితకు చెందేలా వీలునామాలో పేర్కొన్నాడు. అయితే ఆయన మరణానంతరం సదరు భూమిని అతని వారసులు, కుటుంబ సభ్యులకు కాకుండా పక్కనే ఉన్న బి.కొత్తకోట మండలంలోని వెంకటలక్ష్మి అనే మహిళ పేరిట ఎందుకు బదలాయించారో అర్థం కావడం లేదు.
● కురాకుల లక్ష్మిదేవమ్మ పేరిట సర్వే నంబర్ 557/2లో 5 ఎకరాలు, కురాకుల గుర్రప్ప పేరిట సర్వే నంబర్ 557/3లో 3.60 ఎకరాల డీకేటీ భూమి వారి అధీనంలో ఉంది. ఇటీవల వన్‌బీ కోసం సచివాలయానికి వెళ్లారు. సదరు భూమి బి.కొత్తకోటలో కాపురం ఉంటున్న ఇద్దరు వ్యక్తుల పేరిట ఉండటం చూసి హక్కుదారులు నివ్వెరపోతున్నారు.
సమస్యలను పరిష్కరిస్తాం
ఈ మధ్య కాలంలో నా దృష్టికి కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇవి ఎప్పుడు జరిగాయో నాకు తెలియదు. బాధిత రైతులు సమగ్రమైన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటే రికార్డులు పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తాం.
–శ్రీరాములు నాయక్, తహసీల్దార్
హక్కుదారుల నోట్లో మట్టి కొట్టి..
ఇతరులకు కట్టబెట్టి
సంపతికోటలో భూ మాయాజాలం
కర్ణాటక వాసుల పేరిట కూడా
డీకేటీ భూముల మార్పిడి
ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహబూబ్‌పీర్. ఇతని అవ్వ హజీరాబీ పేరిట 278 సర్వే నంబర్‌లో 4.85 ఎకరాల డీకేటీ భూమి ఉండగా ఆమె అనంతరం సదరు భూమికి ఇతనే వారసుడు. అయితే సదరు భూమి శాంతమ్మ పేరిట రికార్డుల్లో నమోదైంది. ఈమె కర్ణాటక రాష్ట్రం కొత్తుడియంకు చెందిన మహిళగా బాధితుడు పేర్కొన్నాడు.
రెవెన్యూ లీలలు ఇంతింత కాదయా.!
Comments
Please login to add a commentAdd a comment