అరుదైన ప్రపంచ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి
కురబలకోట : జిడ్డు కృష్ణమూర్తి.. ఈపేరు ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియకపోవచ్చు. అయితే ప్రపంచ వ్యాప్తంగా వినుతికెక్కారు. ఆధ్యాత్మిక, దార్శనిక, తాత్విక వేత్త. ఆయన ఫిలాసఫీ ఎందరినో కదిలించింది. జాతి, మత, దేశ, రాజకీయ ఆదర్శాలకు అతీతంగా విద్యార్థులకు విద్య నందించడమే నూతన ప్రపంచానికి మార్గమన్నారు. సత్యాన్వేషణతోనే జ్ఞానోదయం అని చాటి చెప్పిన ప్రపంచ తత్వవేత్తగా ఖ్యాతి గడించారు. ఆయన జీవిత విశేశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. మదనపల్లెలో పుట్టిన వాడిగా ఆయనలా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నవారు లేరు. మదనపల్లెలో పుట్టి మద్రాస్ అడయార్‌లో పెరిగి ఆపై ప్రపంచ మాస్టర్‌గా ఎదిగారు. 60 ఏళ్లకు పైగా పలు దేశాలు పర్యటించారు. జీవన సందేశాన్ని వినిపించారు. విప్లవాత్మకమైన జీవన తాత్వికతను ప్రపంచానికి అందించారు. ప్రధానంగా సత్యాన్ని తెలుసుకోవడానికి దారులు లేవు. ఎవరికి వారు అన్వేషించి తెలుసుకోవాలన్నారు. ఎవరినో ఆదర్శంగా తీసుకోవడం కన్నా నిన్ను నీవు తెలుసుకోవడం వల్ల సత్యాన్ని తెలుసుకోగలవన్నారు. సాంప్రదాయ విద్య కన్నా స్వతంత్ర ఆలోచన కలిగించే విద్య మనిషిని మేల్కొలుపుతుందన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండరాదన్నారు. మనిషిని పరిపూర్ణుడిగా చేయడమే విద్య కర్తవ్యమని బోధించారు. విద్యార్థి నిరంతరం నేర్చుకునే వాడిగా ఉండాలి. టీచర్ విద్యార్థిలోని సృజనాత్మకతను తట్టి మేల్కొలిపేలా ఉండాలి. మనసు నిండా ప్రేమను నింపుకున్న వారు మంచి తప్ప చెడు చేయలేరు. మనిషి సంపూర్ణుడిగా ఎదగాలని పదేపదే చెప్పారు. పదవులను ఆయన తృణప్రాయంగా ఎంచారు. ఇప్పటి తరం వారు చిన్న పదవి లభిస్తే వదలమన్నా వదలరు. ఆపై నానా పైరవీలు చేస్తారు. అనిబిసెంట్ అప్పట్లో ఆయన్ను ప్రపంచానికి జగద్గురువును చేయాలని ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అనే అంతర్జాతీయ సంస్థకు అధినేతను చేశారు. అది నచ్చక 1926లో రద్దు చేయడంతో పాటు ఏకంగా దాని నుంచి వైదొలిగారు. వందల కోట్ల ఆస్తిని వదులుకున్నారు. అప్పట్లో యావత్ ప్రపంచమే విస్తుపోయింది. మానసిక విప్లవం, మనోభావ విచారణపై ఎన్నో ప్రసంగాలు చేశారు. ఎవరికి వారు మార్పు చెందాలన్నారు. మూఢ నమ్మకాల నుంచి విముక్తి పొందాలనేవారు. 1895 మేలో జన్మించిన ఆయన 1986 ఫిబ్రవరి 17న శాశ్వత నిద్రలోకి వెళ్లారు. కృష్ణమూర్తి ఫౌండేషన్ (కేఎఫ్‌ఐ) పేరిట దేశ విదేశాల్లో విద్యాలయాలు నడుస్తున్నాయి. 1925లో సోదరుడు నిత్యానంద ఆకస్మిక మరణం ఆయనలో ఎనలేని మార్పునకు దారి తీసింది. జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు పలు భాషల్లోకి అనువాదమయ్యాయి. ప్రసంగాలు కోట్ల మందిని కదిలించడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎందరినో ప్రభావితం చేసిన ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణం. ఆధునిక తత్వవేత్తలలో ఆద్యుడిగా, ప్రపంచ జ్ఞానిగా పేరు గడించారు. ప్రపంచానికి భారత దేశం అందించిన గొప్ప మహోన్నతుడిగా, విశ్వ మానవుడిగా జిడ్డు కృష్ణమూర్తిని యావత్ ప్రపంచం కొనియాడుతోంది.
నేడు వర్ధంతి
‘‘ప్రపంచం మొత్తం నీలోనే ఉంది. ఎలా చూడాలో తెలిస్తే దాన్ని తెరిచే తలుపు ఇక్కడే ఉంది. కానీ ఆ తలుపు తెరిచే తాళం మాత్రం ఎవరూ ఇవ్వలేరు. నువ్వు తప్ప వేరెవరూ తలుపు కూడా తెరవలేరు.’’
– జిడ్డు కృష్ణమూర్తి, ప్రపంచ తత్వవేత్త
Comments
Please login to add a commentAdd a comment