
ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడో?
రాయచోటి: టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఒకటి. ఎన్నికలకు ముందు మహిళలు ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చంటూ విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు. టీడీపీ కూటమి నేతలు గద్దెనెక్కి ఎనిమిది నెలలు దాటినా హామీలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉచిత బస్సు ప్రయాణం ఇక ఎప్పుడా అని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచిత ఆర్టీసీ ప్రయాణం అమలు చేశాయి. తమిళనాడు రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పటినుంచో అమలులో ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీడీపీ అదే ఫార్ములాను అమలు చేసింది. ఉచిత బస్సు అంటూ జోరుగా ప్రచారం చేపట్టింది. అయితే ఈ ఉచిత బస్సు హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. చంద్రబాబునాయుడు ఉచిత బస్సు ప్రయాణమని ప్రజలను మభ్యపెట్టారని స్పష్టం కావడంతో మహిళలు ఉసూరుమంటున్నారు.
ఉచిత ప్రయాణంపై కానిరాని స్పష్టత
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటివరకు కనీసం స్పష్టత ఇవ్వలేదు. అయితే రోడ్డు రవాణాశాఖ మంత్రి త్వరలోనే అని చెప్పడం తప్ప ఎప్పటినుంచి ప్రారంభిస్తారో స్పష్టంగా చెప్పకపోవడం శోచనీయం. తొలుత గతేడాది ఆగస్టు 15 నుంచి అనడం, మళ్లీ మహిళలకు దీపావళి కానుకగా ఉచిత బస్సు ప్రయాణం అని వదంతులు సోషల్ మీడి యాలో హల్‌చల్‌చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికితోడు ఏకంగా చంద్రబాబు సైతం సూపర్ సిక్స్ హామీలైతే ఇచ్చాంగానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే భయమేస్తోందని వ్యాఖ్యానించడం మహిళల అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
పండుగల పేరుతో కాలయాపన
హామీ అమలుకు పండుగల పేరుతో కూటమి నాయకులు కాలయాపన చేస్తున్నారని పలువురు మహిళలు విమర్శిస్తున్నారు. దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ కప్పదాటు ప్రయత్నాలు చేస్తున్నారని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పటికై నా ఇచ్చిన మాట ప్రకారం హామీల అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మహిళలు, వివిధ పార్టీల నేతలు కోరుతున్నారు.
మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే..
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు 7,26,327 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అయితే రోజూ సగటున 50 శాతం మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమని కూటమి నేతలు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇతర హామీలతోపాటు ఈ హామీని తుంగలో తొక్కారు.
ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కొరవడిన స్పష్టత
మాటలకే పరిమితమైన హామీ
పట్టించుకోని ప్రభుత్వం
మోసపోయామని మహిళల ఆవేదన

ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడో?
Comments
Please login to add a commentAdd a comment