కారు ఢీ కొని ఇద్దరికి తీవ్ర గాయాలు
నందలూరు : కడప–చైన్నె ప్రధాన రహదారిలోని నందలూరు బస్టాండ్ కూడలిలో సోమవారం సాయంత్రం బైకును కారు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. మాధవరం నుంచి తాళ్లపాకకు బైకుపై వెళ్తున్న కమ్మినేని ప్రసాద్, శ్రీకళ దంపతులను కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రసాద్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
హైవేపై రోడ్డు ప్రమాదం
బి.కొత్తకోట : మదనపల్లె నుంచి ఖాళీ టమాట క్రేట్లతో స్వగ్రామానికి వెళ్తున్న రైతుల వాహనం బి.కొత్తకోట మండలంలోని అమరనారాయణపురంలో సోమవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో మదనపల్లెకు తరలించారు. వివరాలు.. శ్రీసత్యసాయిజిల్లా ముదిగుబ్బ మండలం సంకేపల్లి పంచాయతీ బాపనపల్లికి చెందిన రైతులు నరేంద్ర (56), శివశంకర్ (40)లు టమాట పంటను విక్రయించేందుకు సాయంత్రం బోలేరో పికప్ వాహనంలో మదనపల్లె మార్కెట్‌కు తీసుకొచ్చారు. మార్కెట్‌లో టమాటలను ఉంచి తిరిగి స్వగ్రామానికి బయలుదేరారు. రాత్రి 9 గంటల సమయంలో మదనపల్లె నుంచి కదిరివైపు వస్తుండగా బి.కొత్తకోట మండలం అమరనారాయణపురం జాతీయరహదారి వద్దకు రాగానే ప్రమాదం జరిగింది.
రైతులు వెళ్తున్న వాహనం ఎదురుగా కారు రావడంతో ప్రమాదం తప్పించే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో లారీ–బోలేరో పికప్ వాహనం బాగా దెబ్బతిన్నాయి. బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
పరీక్షల భయాన్ని పోగొట్టడం అభినందనీయం
రాయచోటి అర్బన్ : విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల పట్ల ఉన్న భయాన్ని పోగొట్టేందుకు విద్యార్థి సంఘాల నేతలు ప్రజ్ఞా వికాస్ పరీక్షలను నిర్వహిస్తుండడం అభినందనీయమని డీఈఓ సుబ్రమణ్యం అన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో ఈనెల 27న యూటీఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐల ఆధ్వర్యంలో నిర్వహింప తలపెట్టిన ప్రజ్ఞావికాస్ పరీక్ష పోస్టర్‌ను డిప్యూటీ డీఈఓ శివప్రకాష్‌రెడ్డి, ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్ శ్రీనివాసరాజు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జాబీర్‌లతో కలసి విడుదల చేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాయచోటి యూటీఎఫ్ కార్యదర్శి రాజా రమేష్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ, జిల్లా ఉపాధ్యక్షుడు గురునాథ్, బన్నీ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు రైతులకు తీవ్ర గాయాలు
కారు ఢీ కొని ఇద్దరికి తీవ్ర గాయాలు
కారు ఢీ కొని ఇద్దరికి తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment