బుద్ధునికొండ అభివృద్ధికి సహకరించాలి
మదనపల్లె : మండలంలోని అంకిశెట్టిపల్లె బుద్ధునికొండ అభివృద్ధికి సహాయం అందించాల్సిందిగా సీఎం చంద్రబాబునాయుడుని కోరుతామని ఇంటర్నేషనల్ బిక్ఖు సంఘం ప్రతినిధులు భంతే సద్దారక్కిత(తెలంగాణ), డాక్టర్ నాగభూషణం భంతే(యూపీ), భంతే నాగరత్న(కర్నాటక)లు తెలిపారు. సోమవారం బుద్ధ అంబేద్కర్ సమాజ్ ఫౌండర్ ట్రస్టీ ఉపాసక పీటీఎం శివప్రసాద్‌తో కలిసి బుద్ధుని కొండను సందర్శించారు. విహారలోని బోధి వృక్షానికి, భగవాన్ బుద్ధ విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ...ప్రకృతి సిద్ధమైన సౌందర్యం, కనువిందుచేసే ఆధ్యాత్మిక శోభతో మానసిక వికాసం కలిగించి, పంచశీల పరివర్తన పీఠంగా చరిత్ర పుటల్లో నిలిచే గొప్ప పుణ్యక్షేత్రం బుద్ధునికొండ అని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పురాతన బౌద్ధ విహారాలు చాలావరకు శిథిలావస్థలో ఉండగా, కొత్తగా మరికొన్ని విహారాలు నిర్మాణంలో ఉన్నాయని, వీటి అభివృద్ధికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తే రాష్ట్రంలో టూరిజం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
ధమ్మసభకు విచ్చేయండి..
బెంగళూరు సిటీ సదాశివనగర్‌లోని నాగసేన బుద్ధవిహారలో ఇంటర్నేషనల్ బిక్ఖుసంఘం సౌత్ ఇండియా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈనెల 23న ధమ్మసభ నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధభిక్షువులు హాజరవుతున్న ఈ సభకు బౌద్ధ ఉపాసిక, ఉపాసకులు, బౌద్ధాభిమానులు పెద్దసంఖ్యలో విచ్చేసి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రఘునాథ్, ట్రస్ట్ సభ్యులు నీరుగట్టి రమణ, చాట్ల బయన్న, తలారి కృష్ణ, బురుజ జనార్దన్, నీరుగట్టి రాజేష్, సి.కల్యాణ్, బైనేని సురేష్, శరత్‌కుమార్, శంకరమ్మ, పృథ్విరాజ్ అంబేడ్కర్(అభి) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment