పోలీస్ శాఖపై విశ్వసనీయత పెంచాలి
రాయచోటి: పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వసనీయత పెంపొందేలా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పెంచాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై నిశితంగా సమీక్ష జరపాలని పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. నేర నిరూపణలకు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి శాసీ్త్రయ పద్ధతులను పాటిస్తూ నేర పరిశోధన చేయాలన్నారు.
రౌడీ షీట్ ఓపెన్ చేయాలి..
అలవాటు పడిన నేరస్తులపై రౌడీషీట్ కేసులు నమోదు చేయాలని ఎస్పీ సూచించారు. అలాగే పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
ఉక్కుపాదం మోపాలి..
జిల్లాలో అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించే వారిపట్ల కఠిన చర్యలు చేపట్టి ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆదేశించారు. ముఖ్యంగా గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు చేయాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, జూదం జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. గతంలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించిన వారి కదలికలపై నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో చైన్ స్నాచింగ్‌లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలు, నిషేధిత మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై యువతను, ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు.
ప్రజలతో మంచి సంబంధాలు..
విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాలు, పట్టణాలలోని కాలనీలను సందర్శిస్తూ ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి, మదనపల్లె డీఎస్పీ కొండయ్య నాయుడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
Comments
Please login to add a commentAdd a comment