కాశినాయన : మండలంలోని పాపిరెడ్డిపల్లె గ్రామంలో ఘర్షణ పడిన అన్నదమ్ములు బోడెపాటి శ్రీను, సుబ్బయ్యలపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ హనుమంతు తెలిపారు. శ్రీను, సుబ్బయ్యలకు కలిపి మూడు ఎకరాలు భూమి ఉందని, భాగ పరిష్కారాలు కుదరక కోర్టుకు వెళ్లారని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తుండగా శ్రీను బుధవారం ఆ పొలంలో షెడ్డు వేసేందుకు వెళ్లాడన్నారు. కోర్టులో కేసు నడుస్తుండగా రేకుల షెడ్డు ఎలా వేస్తావని సుబ్బయ్య అనడంతో మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారన్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
పది టిప్పర్లు సీజ్
దువ్వూరు : దువ్వూరు గుట్ట నుంచి అక్రమంగా సుద్దను తరలిస్తుండగా.. పది టిప్పర్లు, పొక్లెయిన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తహసీల్దారు అక్బల్‌బాషా తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. గత రెండు రోజుల నుంచి మైదుకూరు ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి టిప్పర్లతో అక్రమంగా సుద్ద తరలిస్తున్నారని తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా, మెగా ఇంజినీరింగ్ సంస్థ సుద్ద రవాణా చేస్తోందన్నారు. దీంతో పట్టుకుని పది టిప్పర్లను పోలీసుస్టేషన్‌కు తరలించామని, ఉన్నతాధికారులు ఆధేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో దొంగలు
లింగాల : మండలంలోని వెలిదండ్ల సమీపంలోని చీని తోటలో ఆరు బస్తాల చీని కాయలు చోరీ చేస్తున్న దొంగలను పట్టుకుని రైతులు పోలీసులకు అప్పగించారు. స్థానికుల వివరాల మేరకు.. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చీనీ కాయలు చోరీ చేస్తున్న దొంగలను రైతులు గమనించారు. వారు పరారవుతుండగా వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చీనీ కాయలతోపాటు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ వైర్లను దొంగలించినట్లు రైతులు తెలిపారు. లింగాల, బోనాల గ్రామాలకు చెందిన నలుగురు దొంగలతోపాటు, స్కూటీ, ఆటోను పోలీసులకు అప్పగించినట్లు రైతులు తెలిపారు. దీనిపై పోలీసులు విచారిస్తున్నారు.
ఉరివేసుకుని బాలిక ఆత్మహత్య
కడప అర్బన్ : కడప నగరంలోని రిమ్స్ పిఎస్ పరిధిలో రామకృష్ణ నగర్‌లో నివాసం వుంటున్న చిన్నం రమేష్ కుమార్తె జాహ్నవి (15) కుటుంబ సమస్యలతో బుధవారం ఇంటిలో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పదో తరగతి వరకు చదువుకుని ఇంటి వద్దే వుంటున్న బాలిక ఈ చర్యకు పాల్పడిందని తండ్రి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అవమానించిందని మహిళ హత్య
వేముల : మండలంలోని కె.కె.కొట్టాల సమీపంలో ఈ నెల 2న జరిగిన సింగంశెట్టి పద్మావతి హత్య కేసును పోలీసులు చేధించారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీఐ ఉలసయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. కె.కె.కొట్టాల గ్రామానికి చెందిన సింగంశెట్టి పద్మావతి గ్రామ సమీపంలో ఎనుములు మేపుకుంటుండగా గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వెళ్లారన్నారు. పద్మావతిని చంపి ఆమె శరీరంపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు ఎత్తుకెళ్లారన్నారు. మృతురాలి కుమార్తె గోగుల దివ్య ఫిర్యాదు మేరకు విచారించామని తెలిపారు. మృతురాలు సింగంశెట్టి పద్మావతి తనను అవమానకరంగా మాట్లాడుతుండడంతో చంపాలని సింగంశెట్టి రమేష్ నిర్ణయించుకున్నాడన్నారు. ఈ నెల 2న ఎనుములు మేపుకొనేందుకు పద్మావతి వెళ్లగా.. అక్కడికి వెళ్లిన రమేష్ చేతులకు ప్లాస్టిక్ గ్లౌజులు ధరించి తలపై దాడిచేసి చంపాడన్నారు. మెడలో బంగారు గొలుసు, చెవి కమ్మలు అపహరించాడన్నారు. బుధవారం ముద్దాయి సింగంశెట్టి రమేష్‌ను అరెస్టు చేసి అతని వద్ద బంగారు గొలుసు, చెవి కమ్మలను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు వారు తెలిపారు.
ధాత్రి పురస్కారాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
కడప కల్చరల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిభ గల మహిళలకు 2025 సంవత్సరానికి గానూ ధాత్రి పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు చేయనున్నామని వివేకానంద ఫౌండేషన్ అధ్యక్షులు పాపిజెన్ని రామకృష్ణ తెలిపారు. సామాజిక సేవ చేస్తున్నా, మహిళా అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment