రెవెన్యూ రికార్డుల్లో జాడలేని చిట్టిబోయనపల్లె
గుర్రంకొండ : మండలంలోని చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం రెవెన్యూ రికార్డుల్లో కనిపించకుండా పోయింది. ఈ గ్రామానికి చెందిన రైతులు గుర్తింపు కార్డుల కోసం రోజుల తరబడి రైతు సేవా కేంద్రం వద్ద పడిగాపులు కాస్తూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కనీసం ముటేషన్ చేద్దామనుకున్నా ఆన్‌లైన్‌లో చిట్టిబోయనపల్లె గ్రామానికి సంబంధించి వివరాలు కనిపించడం లేదు. ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామానికి చెందిన వందలాది ఎకరాల భూముల జాడే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
1800 ఎకరాలు 328 మంది రైతులు
మండలంలోని చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం పరిధిలో మొత్తం 1800 ఎకరాలు భూములు ఉండగా అందులో 328 మంది రైతులు వ్యవసాయం చేసుకొంటున్నారు. 2005 సంవత్సరం ముందు వరకు అవి శోత్రియం భూములుగా ఉంటూ అక్కడి రైతులకు తమ భూములపై ఎలాంటి హక్కులుగానీ, పట్టాదారుపాసుపుస్తకాలు గానీ ఉండేవి కావు. మండలంలోని అన్ని గ్రామాలకు ప్రభుత్వ పథకాలు అందినా చిట్టిబోయనపల్లె రైతులకు మాత్రం ఎలాంటి ప్రభుత్వ పథకాలుగానీ, పంటసాయంగానీ అందేవి కావు. 2005లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత 50 ఏళ్ల శోత్రియం భూముల సమస్యకు పరిష్కారం దొరికింది. అప్పట్లో ఈ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఎవరైతే సదరు భూముల్లో చాలా కాలం నుంచి వ్యవసాయం చేసుకొంటున్నారో ఆ రైతులందరికి ఎనిమిది విడతలుగా పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేశారు. అప్పటి నుంచి రైతులకు అన్ని ప్రభుత్వ పథకాలతో పాటు బ్యాంకుల్లో రుణాలు అందుతున్నాయి.
ఆన్‌లైన్‌లో నమోదు కాని
రైతు గుర్తింపు కార్డులు..
మండలంలోని అన్ని గ్రామాల్లో రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో మాత్రం ఇంతవరకు ఒక్కరైతుకు గుర్తింపు కార్డు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. రైతు సేవా కేంద్రంలో వ్యవసాయశాఖ సిబ్బంది. సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వం జారీ చేసిన ప్రత్యేక వెబ్‌సైట్‌లో చిట్టిబోయనపల్లెకు చెందిన రైతుల వివరాలు మొదట్లో నమోదు చేస్తున్నారు. భూమి పాసుపుస్తకం, రైతు ఆధార్ కార్డు నంబరు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తరువాత రైతు సెల్‌ఫోన్‌కు రెండు సార్లు ఓటీపీలు వస్తున్నాయి. చివరగా వెబ్‌సైట్‌లో ల్యాండ్ మార్కింగ్ దగ్గరకి వెళితే మాత్రం చిట్టిబోయన పల్లె రెవెన్యూ గ్రామానికి సంబంధించిన భూముల వివరాలు గానీ, సర్వే నంబర్లుగానీ చూపించడంలేదు. ప్రతిరోజు ఎన్ని మార్లు ప్రయత్నించినా చివరకు ఇదే ఫలితం వస్తోందని సిబ్బంది, రైతులు వాపోతున్నారు.
గడువు ముగుస్తుండడంతో
రైతుల ఆందోళన..
రైతుగుర్తింపు కార్డు నమోదు, జారీ ప్రక్రియ గడువు ముగుస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత పది రోజులుగా మండలంలో రైతు గుర్తింపు కార్డు ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మండల వ్యాప్తంగా 3548 మంది రైతు గుర్తింపు కార్డులు వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఈనెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం గడువు విధించింది. అయితే చిట్టిబోయనపల్లె రైతులకు మాత్రం ఇంతవరకు ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియ జరగలేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రోజుల తరబడి రైతుసేవాకేంద్రాల వద్దకు వెళ్లడం అక్కడే పడిగాపులు కాయడంతోనే రోజంతా గడిచిపోతోంది. నిర్ణీత గడువులోగా గుర్తింపుకార్డులు ఇవ్వలేక పోతే తమ పరిస్థితి ఏంటని రైతులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తహసీల్దార్ కార్యాలయంలోనూ చిట్టిబోయనపల్లె భూములకు సంబంధించి ఎలాంటి ముటేషన్లు జరగడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ వెబ్‌ల్యాండ్‌లో చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలోని భూములకు సంబంధించి సమస్య చాలా కాలంగా ఉందనే విషయం ఇప్పుడు వెలుగుచూడడం గమనార్హం.
రైతు గుర్తింపు కార్డు కోసం
రైతుల పడిగాపులు
రోజుల తరబడి రైతుసేవా కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు
ఆన్‌లైన్‌లో కనిపించని
చిట్టిబోయనపల్లె భూములు
ఆందోళనలో రైతులు
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో రైతులకు రైతు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ జరగడం లేదనే విషయం జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. గత పది రోజులుగా సమస్య ఉంది. రైతులు రోజు రైతుసేవా కేంద్రాలకు వచ్చి వెళుతున్నారు. రైతుల వద్ద నుంచి తాము జిరాక్స్ కాపీలను తీసుకొని వెబ్‌సైట్‌లో సమస్య పరిష్కారం కాగానే సమాచారం అందిస్తామని చెప్పి పంపిస్తున్నాము. నాలుగైదు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు.
– రత్నమ్మ, ఏఓ, గుర్రంకొండ.
ముటేషన్లు కావడం లేదు
చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో రైతుల పొలాలకు సంబంధించి ముటేషన్లు కూడా కావడం లేదు. రైతుగుర్తింపు కార్డుల జారీలో చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వ్యవసాయాధికారులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ భూములకు సంబంధించి ఆన్‌లైన్‌లోనే సమస్య ఉన్నట్లు గుర్తించాము. సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాము. త్వరలొనే సమస్యను పరిష్కరించి రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు సహకరిస్తాము.
– శ్రీనివాసులు, తహసీల్దార్, గుర్రంకొండ.
రెవెన్యూ రికార్డుల్లో జాడలేని చిట్టిబోయనపల్లె
రెవెన్యూ రికార్డుల్లో జాడలేని చిట్టిబోయనపల్లె
Comments
Please login to add a commentAdd a comment