నా వద్ద రూ.2800
తీసుకున్నాడు
నావద్ద కరెంట్ బిల్ కట్టాలని జూనియర్ లైన్‌మ్యాన్ రామేశ్వర్‌రెడ్డి రూ.2800 తీసుకున్నాడు.. కానీ కార్యాలయంలో జమ చేయలేదు. దీంతో మరుసటి నెలలో బిల్ మొత్తం చెల్లించాలని సిబ్బంది నన్ను హెచ్చరించారు. అంతేగాక తన వ్యక్తిగత అవసరాల కోసం నా వద్ద అప్పుగా రూ.20000 తీసుకున్నాడు. తిరిగి చెల్లించకపోగా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు.
– రామచంద్ర, ఎగువగొట్టివీడు
ఉన్నతాధికారులకు
నివేదికలు పంపాం
జూనియర్ లైన్‌మ్యాన్ రామేశ్వర్‌రెడ్డి మార్చి 10 నుంచి విధులకు హాజరు కాకపోవడంతో.. పరారీలో వున్నట్లుగా గుర్తించి ఇదే విషయమై జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. విద్యుత్ బిల్లుల వసూళ్ల విషయంపై బాధితులు ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటాం.
– విజయ్‌కుమార్‌రెడ్డి,
ఏడీ, విద్యుత్ శాఖ, రాయచోటి
గాలివీడు : అతనో బాధ్యత కలిగిన విద్యుత్ శాఖలో జూనియర్ లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వినియోగదారుల నుంచి విద్యుత్ బిల్లులను వసూలు చేసి.. నగదు కార్యాలయంలో లెక్కచెప్పాలి. అయితే ఇక్కడ కంచే చేను మేసిన చందంగా వసూళ్ల నగదు మొత్తాన్ని స్వాహా చేసి.. గుట్టు చప్పుడు కాకుండా ఉడాయించాడు. వివరాల్లోకి వెళితే.. గాలివీడు మండల కేంద్రంలో సచివాలయం జూనియర్ లైన్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న రామేశ్వర్‌రెడ్డి దాదాపుగా రూ.20 లక్షల వరకూ వినియోగదారుల వద్ద నుంచి విద్యుత్ బిల్లులు వసూలు చేసి నగదుతో ఉడాయించాడు. ఇతను ఇంటింటికీ వెళ్లి కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ నగదు వసూలు చేసేవాడు. రశీదు ఇవ్వాలని అడిగితే, బిల్ తీసే యంత్రం పని చేయడం లేదు, మీ నగదు చెల్లింపులు పూర్తయ్యాయి. కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది వుండదంటూ నమ్మబలికే వాడు. సదరు జూనియర్ లైన్‌మ్యాన్ మాత్రం ఎంచక్కా ఆ నగదుతో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ జల్సా చేసేవాడు. ఇదే క్రమంలో మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని చిలకలూరిపేటలో విద్యుత్ బకాయిలు చెల్లించలేదంటూ సిబ్బంది వినియోగదారుల ఇళ్ల వద్దకు రావడంతో.. ఖంగుతిన్న బాధితులు తాము ఇది వరకే జూనియర్ లైన్‌మ్యాన్‌కు చెల్లించామంటూ వాపోయారు. ప్రస్తుతం సదరు ఉద్యోగి విధి నిర్వహణలో లేడని, మీ బిల్లుల నగదు చెల్లింపులు జరగలేదని, వెంటనే కరెంట్ బిల్ చెల్లించకపోతే కనెక్షన్లు తొలగిస్తామని సిబ్బంది హెచ్చరించడంతో.. వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో చేసేదేమీ లేక బాధితులు లబోదిబోమంటున్నారు. గతంలో ఎగువగొట్టివీడు గ్రామంలో విధులు నిర్వహించిన సమయంలో కూడా ఆప్రాంతంలో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లుగా సమాచారం. అంతేగాక పరిచయం ఉన్న వాళ్ల దగ్గర పెద్ద మొత్తంలో అప్పుగా డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ పలువురు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బకాయిల వసూళ్ల నగదు మొత్తం చెడు వ్యసనాలతో ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు పాల్పడుతూ.. అప్పులపాలై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పరారైనట్లు తోటి ఉద్యోగులు తెలిపారు. వెంటనే జిల్లా స్థాయి విద్యుత్ అధికారులు విచారణ జరిపి సదరు ఉద్యోగిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కాజేసిన సొమ్ము రికవరీ చేసి బాధితులకు ఇప్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
రూ.20 లక్షల వరకు
కరెంటు బిల్లుల నగదు స్వాహా
ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంతోనే నిర్వాకం
విషయం బయటికి పొక్కడంతో జూనియర్ లైన్‌మ్యాన్ పరారీ