
కోదండరాముడి కల్యాణోత్సవానికి చురుగ్గా ఏర్పాట్లు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో ఏప్రిల్ 11న సీతారాముల కల్యాణోత్సవాన్ని ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని, ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని రాష్ట్ర దేవదాయశాఖా మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎస్ సవిత సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం ఒంటిమిట్ట టీటీడి కల్యాణ మండపం సమీపంలోని పరిపాల భవన సమావేశ మందిరంలో వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ అశోక్ కుమార్, టీడీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ విజిలెన్స్ ఎస్పీ విష్ణువర్దన్ రాజు, జేసీ అదితి సింగ్‌తో కలిసి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈనెల 11వ తేదీన సీతారాముల కల్యాణం వైభవంగా జరగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తయ్యాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించారు.ప్రజా భద్రత కోసం సుమారు 150కిపైగా సీసీ, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాల నుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకొని పక్కాగా ప్లాన్ రూపొందించుకొని పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.మంత్రి సవిత మాట్లాడుతూ కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు అత్యంత ప్రముఖులు రావచ్చనే అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు. కల్యాణవేదిక ప్రాంగణాన్ని భక్తులు శోభాయమానంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. వైఎస్సార్ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు, తాగునీటి వసతి కల్పించామన్నారు.108 వాహనాలు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. వైఎస్సార్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, టీటీడీ విజిలెన్స్ ఎస్పీ హర్షవర్దన్ రాజు మాట్లాడుతూ టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీసులు సమష్టి కృషితో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి గ్యాలరీ వద్ద గట్టి భద్రతా చర్యలు చేపడతామన్నారు. టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం బ్రహ్మోత్సవాల విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని అధికారులను కోరారు.
కల్యాణ వేదిక పరిశీలన
అంతకుముందు మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, సవిత, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం దేవస్థానం సమీపంలోని కల్యాణ వేదికను వారు పరిశీలించారు.ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్ మంత్రులకు వివరించారు. కార్యక్రమంలో కడప, పులివెందుల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, చిన్నయ్య, టీటీడీ డిప్యూటీ ఈఓ నటేష్, డీఆర్‌డీఏ పీడీ ఆనంద్ నాయక్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ నాగరాజు, డీపీఓ రాజ్యలక్ష్మీ, పంచాయతీ రాజ్ ఎస్‌ఈ శ్రీనివాస్ రెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్‌ఈ రమణయ్య పాల్గొన్నారు.
మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, సవిత