
ఉపాధ్యాయుని ఇంటిలో చోరీ
బి.కొత్తకోట : ప్రభుత్వ ఉపాధ్యాయులైన భార్యాభర్తలు రాయచోటిలో పదవ తరగతి స్పాట్ వాల్యూయేషన్ కోసం వెళ్లారు. ఇంటిలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఘటన సోమవారం తెల్లవారుజాము బి.కొత్తకోట సంతబజారువీధిలో జరిగింది. బాధితుల కథనం మేరకు వివరాలు.. స్థానిక సంతబజారులో నివాసం ఉంటూ బీరంగలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు కిరణ్‌కుమార్, పీటీఎం మండలంలో పనిచేస్తున్న ఆయన భార్య అనిత ఇద్దరూ ఈనెల 3వ తేదీనుంచి రాయచోటిలో పదవ తరగతి జవాబు పత్రాలను దిద్దేందుకు వెళ్లారు. సోమవారం ఉదయం పక్కింటిలో ఉంటున్న మునీర్ నుంచి కిరణ్‌కుమార్‌కు ఫోన్ వచ్చింది. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయని చెప్పడంతో ఆయన ఇంటికి చేరుకున్నారు. దుండగులు ఇంటికి వేసిన తాళాలను గడ్డపారతో పగులగొట్టి లోపలికి వెళ్లారు. బీరువా, లాకర్‌ను పగులగొట్టి అందులోని బంగారు, వెండి నగలు, డాక్యుమెంట్ పత్రాలను దోచుకున్నారు. మార్కెట్‌లో ప్రస్తుత విలువ ప్రకారం రూ.22 లక్షల విలువజేసే 250 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.5 లక్షల విలువజేసే ఐదు కిలోల వెండి ఆభరణాలు, దేవుడికి సంబంధించిన వస్తువులను ఎత్తుకెళ్లారు. రూ.20 వేల నగదు చోరీ చేశారు. ఈమేరకు బాధితుడు కిరణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రాయచోటి నుంచి క్లూస్ టీం చోరీ జరిగిన ఇంటిలో దొంగల వేలిముద్రలను సేకరించారు. కాగా బంగారు, వెండి ఆభరణాలను కొనుగోలు చేసిన విలువ మేరకు రూ.2.25 లక్షలు ఉంటుందని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
ఇంటి తాళం పగులగొట్టి..
బంగారు, వెండి ఆభరణాలు అపహరణ