
యథేచ్ఛగా భూ కబ్జా
● దళితుల భూముల ఆక్రమణకు టీడీపీ నాయకుల యత్నం
● అడ్డుకున్న చిన్నంపల్లి దళితవాడ రైతులు
ఓబులవారిపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నాయకులు యథేచ్ఛగా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. మంగళవారం పెద్దఓరంపాడు రెవెన్యూ పరిధిలోని చిన్నంపల్లి గ్రామ సమీపంలో యంత్రాలతో భూ కబ్జాలకు పాల్పడ్డారు. గ్రామానికి చెందిన దళితులు ఈ వ్యవహారాన్ని అడ్డుకున్నారు. 1998–99 సంవత్సరంలో సర్వే నెంబరు. 21 99–98లో చిన్నంపల్లి దళిత రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు పట్టాలు ఇచ్చారు. పేద రైతులు భూమిసాగు చేసేందుకు డబ్బులు లేక చెట్లను తొలగిస్తూ వారి ఆధీనంలో ఉంచుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడుతున్నారు. తమ భూములు ఆక్రమించుకుంటున్నారని సోమ వారం దళిత రైతులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. అయినా కూడా మంగళవారం సర్వే నెంబరు. 2202లో చిట్వేలి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు తన పేరుపై, తన బంధువుల పేరుపై ఆన్‌లైన్‌లో భూములు ఉన్నాయని జేసీబీలతో చదును చేసేందుకు కబ్జాకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న దళితవాడ రైతులు అడ్డుకున్నారు. చిట్వేలి మండలానికి చెందిన టీడీపీ నాయకుడు అక్రమంగా ఆన్‌లైన్ చేయించుకొని తమ భూములు కబ్జా చేస్తున్నారని వారు తీవ్ర అభ్యంతరం చెప్పారు. కాగా ఈ విషయమై తహశీల్దార్ శ్రీధర్ రావును వివరణ కోరగా సర్వే నెంబరు. 2202 రికార్డు పరంగా ప్రభుత్వ భూమి అని ఈ నివేదికలు పంపిస్తామని, ఆన్‌లైన్ చేయించుకున్న వారికి నోటీసులు జారీచేస్తామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకుల భూ కబ్జాలను అడ్డుకొని తమకు న్యాయం చేయాలని చిన్నంపల్లి దళితవాడ రైతులు రెవెన్యూ అధికారులను కోరారు.

యథేచ్ఛగా భూ కబ్జా