
గ్యాంగ్‌ల భరతం పడతాం
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో గ్యాంగుల పేరుతో రౌడీయిజం, దౌర్జన్యాలకు పాల్పడే వారి భరతం పడతామని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శివాలయం వద్ద జరిగిన గ్యాంగ్ వార్ కేసులో తొమ్మిది మందిని అరెస్టు చేసి కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యక్రమాలు, అరాచకాలు, దోపిడీలకు పాల్పడిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చట్ట పరిధి దాటిన వారిని ముందుగా హెచ్చరించడంతోపాటు వారికి అన్ని కోణాలలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అప్పటికీ దారికి రాకపోతే వారిపై రౌడీషీట్ కేసులు ఓపెన్ చేసి అవసరమైతే జిల్లా బహిష్కరణ చేయిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో జూద శాలలపై ఉక్కుపాదం మోపామన్నారు. కుల మతాలు, వర్గాల ముసుగులో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్న వారిపట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. ప్రధాన పట్టణాలలో నిరుద్యోగ యువకులు, మైనర్ విద్యార్థులు కొంతమంది మాయమాటలలో పడి మత్తుకు బానిసలై తప్పుదారిలో పయనిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కూడా తగు చర్యలు తీసుకోవడంతోపాటు గ్యాంగుల నిర్వాహకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. రంజాన్ మాసం సందర్భంగా జరిగిన సంఘటనపై కూడా ఇంకా విచారణ సాగుతోందన్నారు. అన్ని వీడియో పుటేజీలను పరిశీలించిన అనంతరం దాడుల్లో పాల్గొన్న వారందరినీ అరెస్టు చేస్తామన్నారు. ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరిగినా తక్షణం పోలీసులు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు అవసరమైన పోలీసులను కూడా సిద్ధం చేశామన్నారు. పట్టణాల పరిధిలో రాత్రి సమయాలలో అదనపు బలగాలతో పోలీసులు గస్తీని ఏర్పాటు చేశామని తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వడం నేరమన్నారు. మైనర్లతోపాటు బైక్‌లు ఇచ్చిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా పోలీస్ దండనను ఎదుర్కోవాల్సి వస్తుందని ఎస్పీ తీవ్రంగా హెచ్చరించారు.
తొమ్మిది మంది ముద్దాయిలు అరెస్టు..
అమ్మాయి విషయంపై ఒకరిపై మరొకరు మనస్పర్థలు పెంచుకొని దాడులు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిసిందన్నారు. ఈ కారణంగానే కక్షలు పెంచుకొని శివాలయం చెక్‌పోస్టు వద్ద జరిగిన ఘర్షణ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. గ్యాంగ్ వార్ దాడిలో ఇరువర్గాలకు చెందిన 24 మందిని గుర్తించి రాయచోటి అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. సయ్యద్ నూరుల్లా ఉరఫ్ నూర్ (21), సయ్యద్ బైతుల్లా (23), షేక్ ఖదీర్ అహ్మద్ ఉరఫ్ ఖాదర్ (24), షేక్ సుహైల్ ఉరఫ్ గుర్రం (21), షేక్ మన్సూర్ అలీ (22), షేక్ ఇర్ఫాన్ (21), షేక్ ఇర్ఫాన్ (21), షేక్ షారుక్ (21), పఠాన్ రియాజ్ అలీఖాన్ ఉరఫ్ నాజుల్లా (22)లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పెడుతున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న 15 మందికోసం వేట సాగుతుందన్నారు. త్వరలోనే వారిని కూడా అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తామన్నారు. నిందితులు దాడులకు ఉపయోగించిన ఐదు కట్టెలు, మూడు ఇనుప రాడ్లు, ఒక ఇనుప చైన్, తొమ్మిది మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. మీడియా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి పాల్గొన్నారు.
అసాంఘిక కార్యక్రమాలు.. అరాచకాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం
గ్యాంగ్‌వార్ ఘటనలో
తొమ్మిది మంది అరెస్టు
మిగిలిన వారికోసం వేట
మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు