
అధికార దర్పం ప్రదర్శిస్తే సహించేది లేదు
రాయచోటి : అధికార పార్టీ దర్పంతో మంత్రి హోదాలో ఏం మాట్లాడినా చెల్లుతుందన్నట్లుగా రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడడంపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్. రమేష్ కుమార్ రెడ్డి భగ్గుమన్నారు. ఆదివారం రాయచోటిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి పనికోసం నిల్వ ఉంచిన కంకర, సామగ్రిని దొంగిలించడంపై మందలించాల్సిన మంత్రి తన పేరు చెప్పుకొని ఎవరైనా తీసుకెళ్తే తాను దొంగతనం చేసినట్టా అని మాట్లాడడం దారుణమన్నారు. ఇలా ఇయితే మంత్రి పేరు చెప్పుకొని ఎవరైనా దర్జాగా దొంగతనాలు చేయొచ్చా? అని మంత్రిని నిలదీశారు. తాను ఎన్నికల సమయంలో కోట్ల రూపాయలు తీసుకొని వైఎస్సార్‌సీపీలోకి వచ్చినట్లు చేసిన ఆరోపణలపై వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రమాణానికి సిద్ధమన్నారు. చంద్రబాబు నాయుడు తనకు టికెట్టు ఇవ్వకుండా ద్రోహం చేశారని, అందుకే పార్టీలో ఉండనని ఆయనకే చెప్పి బయటకు వచ్చానన్నారు. కడపలో తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన విషయం జిల్లా ప్రజలకు తెలుసన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో ఉండి ఆ పార్టీకి నమ్మక ద్రోహం చేసి వైఎస్సార్‌సీపీని ఓడించడానికి టీడీపీ నుంచి రూ. 40 లక్షలు వసూలు చేసిన నీచ చరిత్ర మండిపల్లిది అని ధ్వజమెత్తారు.
జాతీయ రహదారి పనులు నా పేరున లేదంటావా? పనిచేసేందుకు అన్ని అర్హతలు ఉన్న ఒప్పంద పత్రం ఇదిగో చూడండని మంత్రికి సవాల్ విసిరారు.
తనను రాయచోటిలో తిరగనివ్వకుండా చేస్తానన్న మంత్రి మాటలపై రమేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నీలాంటి వారు వందమంది వచ్చినా తనను అడ్డుకోవడం సాధ్యం కాదంటూ హెచ్చరించారు. మూడుసార్లు ఎన్నికల్లో పోటీచేస్తే రెండుసార్లు డిపాజిట్ కూడా దక్కించుకోలేని విషయాన్ని మరచిపోయావా అంటూ ఎద్దేవా చేశారు. సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార
ప్రతినిధి ఆర్. రమేష్ కుమార్ రెడ్డి ఆగ్రహం