నెల్లూరు జిల్లా కదిరినాయుడుపల్లె సమీపంలో రోడ్డు ప్రమాదం
ఇరువురు బద్వేలు వాసులు మృతి
బద్వేలు అర్బన్ : నెల్లూరు జిల్లాలోని పెంచల కోనకు వెళ్లి దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో ఇరువురు బద్వేలు వాసులు మృతిచెందారు. ఆదివారం నెల్లూరు జిల్లాలోని కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడి పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బద్వేలు నియోజకవర్గంలోని అట్లూరు మండలం ముత్తుకూరు గ్రామానికి చెందిన ఎం.నరసింహులు (26) పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు.
అలాగే పట్టణంలోని రూపరాంపేటకు చెందిన వై.ఝాన్సీ (26) అదే ఆసుపత్రిలో పనిచేస్తోంది. ఇరువురు కలిసి శనివారం సాయంత్రం బద్వేలు నుండి ద్విచక్ర వాహనంలో పెంచలకోనకు బయలుదేరారు. అక్కడ దైవదర్శనం చేసుకుని రాత్రికి అక్కడే ఉండి ఉదయాన బద్వేలుకు బయలుదేరారు. ఈ క్రమంలో నెల్లూరు – ముంబై జాతీయ రహదారిలోని కదిరినాయుడుపల్లె అటవీ ప్రాంతంలోకి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నారు.
ఈ ఘటనలో ఝాన్సీ అక్కడికక్కడే మృతిచెందగా నరసింహులును స్థానికులు 108 వాహనంలో బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మర్రిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.