
సన్నగిల్లుతున్న నమ్మకం!
ఈ ఫోటోలో కనిపిస్తున్న వారు బి.కొత్తకోట మండలం గట్టు గ్రామం టేకులపెంటలో కాపురముంటున్న యానాదులు. వీరికి 2000 సంవత్సరంలో సర్వే నెంబరు 1218–4లో 1.68 సెంట్ల డీకేటీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. అయితే అందుకు సంబంధించిన భూమిని ఆన్‌లైన్ చేయించాలని మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్‌కు వినతిపత్రం సమర్పించారు. గతంలోనూ సమస్యను పరిష్కరించాలని అధికారులకు అర్జీలు సమర్పించారు. ఇంతవరకు ఆన్‌లైన్‌లో చేర్చలేదని....దీంతో 1బీ, అడంగల్ రాక ఇబ్బందులు పడుతున్నామని సబ్ కలెక్టర్‌కు వివరించారు. మాకు వెంటనే ఆన్‌లైన్‌లో ఎక్కించేలా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు.
సాక్షి రాయచోటి : ఏప్రిల్ నెల అందునా మండు వేసవి. ఉదయం 10 గంటల నుంచే ప్రారంభమయ్యే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు మండుటెండలో..ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పరుగులు పెడుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో నమ్మకం సన్నగిల్లుతోంది. ఏదో చేస్తారని.. ఏమేమో జరిగిపోతాయని ఎంతో ఆశతో.. కష్టాలు పడుతూ .. కన్నీళ్లు దిగమింగుతూ కలెక్టరేట్ వస్తున్న సమస్యలు పోవడం లేదు..అధికారం అండగా...ఆగడాలు మెండుగా...జిల్లాలో కొనసాగుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు న్యాయం మాత్రం కొండంత దూరంలో కనిపిస్తోంది.. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వచ్చి గోడు వెళ్లబోసుకునేందుకు బారులు తీరుతున్నారు.
న్యాయం కోసం
జిల్లాలోని అటు తంబళ్లపల్లె, ఇటు రైల్వేకోడూరు, మదనపల్లె, రాజంపేట ఇలా చెబుతూపోతే దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కలెక్టరేట్‌కు కదులుతున్నారు. కానీ పెన్షన్లు, ఇతరత్రా చిన్నపాటి సమస్యలకు కూడా ఒక్కోసారి పరిష్కారం గగనంగా మారుతోంది. ఎక్కువగా రెవెన్యూకు సంబంధించి ఆన్‌లైన్, అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న స్థలాలను విడిపించమని, ఇతరత్రా దాడులు, వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. దివ్యాంగులు, వృద్ధులు, ఇతర వ్యక్తిగత సమస్యలతో ప్రతి సోమవారం 250–300 మంది వరకు వస్తున్నారు. ప్రధానంగా ఇంటి పట్టా, ఆన్‌లైన్ సమస్యలు, భూ కబ్జాలు, ఉద్యోగాలు, రుణాల కోసం ఇలా అనేక సమస్యలతో కలెక్టరేట్‌కు న్యాయం కోసం వస్తున్నారు.అయితే జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్, జేసీ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పరిశీలించిన అర్జీల విషయంలో కొంచెం ప్రత్యేక శ్రద్ధ చూపుతుండడంతో కొంతమేర పలితం కనిపిస్తోంది. మిగతా వాటికి సంబంధించి ఆయా శాఖల్లో ప్రయోజనం పెద్దగా ఉన్నట్లు లెక్కల్లో గ్రేడ్లు వేసుకుంటున్నా చాలా వరకు సమస్యలు పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు.
ఉపాధి కూలీలకు
పెండింగ్ సొమ్ము అందించాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని సీపీఐ (ఎం ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ్ ఆధ్వర్యంలో పలువురు కూలీలు జేసీని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. రాయచోటి మండల పరిధిలోని మాధవరం గ్రామం గొర్లముదివీడు గ్రామంలో ఉపాధి కూలీలకు వేతనాలు వెంటనే చెల్లించాలని వారు కోరారు. అంతేకాకుండా తమకు పనిదినాలు 200 రోజులు కల్పించాలన్నారు అలాగే ఉపాధి కూలీలకు వేసవి నేపధ్యంలో రక్షణ కల్పించాలని జేసీకి వివరించారు.
సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి
రాయచోటి : ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రతి సమస్యపై ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను ప్రభుత్వం సీరియస్‌గా పరిశీలిస్తుందన్నారు. కావున అధికారులు ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలన్నారు. సమస్య ఏమిటి, దానిని ఎలా పరిష్కరించాలన్న విషయాలపై అవగాహన ఉండాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్‌ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పింఛన్ తీసేస్తామంటున్నారు
నాకు రెండు చేతులు పనిచేయడం లేదు. ఎప్పుడో సచ్చుపడిపోయాయి. ఉన్నా లేనట్లే. అయితే ఒక్కోసారి పింఛన్ తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఒక్కనెల పింఛన్ తీసుకోకపోవడంతో మేనెల పింఛన్ రాదని గ్రామ సెక్రటరీ చెప్పారు. కలెక్టర్‌కు విన్నవించుకోవాలని వచ్చాను. ఉన్నతాధికారులు న్యాయం చేయాలి. – వెంకట్రాముడు, తవ్వగుంటపల్లె, కేవీ పల్లె మండలం
పదేపదే ఒకే సమస్యపై తిరుగుతున్నా కనిపించని పరిష్కారం
కూటమి సర్కార్ చేపట్టిన
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు తగ్గిపోతున్న బాధితులు
60 నుంచి 70% మేర రెవెన్యూ
సమస్యలతోనే కలెక్టరేట్‌కు

సన్నగిల్లుతున్న నమ్మకం!

సన్నగిల్లుతున్న నమ్మకం!