
ఉపాధి కూలీలను ఆదుకోవాలి
రాయచోటి : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించి కూలీలను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉపాధి హామీ బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న ఆలస్యం, చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలపై ఆయన స్పందించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించి, వలసలు నివారించాలన్న ఉద్దేశంతో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఎన్నో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నాలుగు మాసాలుగా కూలీలకు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వ్యవసాయ కూలీ పనులు సక్రమంగా దొరక్కపోవడంతో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు బిల్లులు చెల్లించకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో అధికారులు వివక్ష చూపుతున్నారని, జాబ్‌కార్డులు తీసేస్తామని రాజకీయ కోణంలో అధికారులు మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. అవినీతి, అక్రమాలకు సహకరిస్తున్న అధికారులు రానున్న రోజుల్లో ఎక్కడున్నా తప్పించుకోలేరని ఆయన హెచ్చరించారు. జరుగుతున్న ప్రతి పనిపై ఆరా తీస్తున్నామని, వీడియోలు ఇతర ఆధారాలతో సహా సేకరిస్తున్నామన్నారు. నాలుగేళ్ల తరువాత అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా నిరూపించి కచ్చితంగా రికవరీ చేయించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. కూలీలు చేయాల్సిన పనులను యంత్రాలతో చేస్తున్నారని, ఊర్లలో లేని వ్యక్తుల పేర్లను మస్టర్లలో నమోదు చేయడం, చేసిన పనులకే తిరిగి మెరుగులు దిద్ది, బెదిరించుకుని బిల్లులు చేయించుకుంటున్నారన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద వీడియోలతో సహా ప్రాంతాల వారీగా, తేదీల వారీగా ఆధారాలు ఉన్నాయన్నారు. పథకంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు శ్రీకాంత్‌రెడ్డి సూచించారు.
పెండింగ్ బిల్లులను త్వరితగతిన చెల్లించి అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయండి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్