
వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కురబలకోట మండలం మట్లివారిపల్లె పంచాయతీ కోనంగివారిపల్లెకు చెందిన ఆనంద కుమారుడు శ్రీనివాసులు (26) ఇంటి వద్ద పురుగుమందు తాగాడు. గ్రామంలో ఆనందకు ఇతరులతో ఉన్న భూ సమస్యల కారణంగా, పోలీస్ కేసు కావడం, తాజాగా ప్రత్యర్థులు కక్షపూరితంగా శ్రీనివాసులుపై మరోసారి కేసు పెట్టడంతో, పోలీసులు స్టేషన్ పిలిపించి విచారించారు. దీన్ని అవమానంగా భావించి మనస్థాపంతో శ్రీనివాసులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనిల్ రైల్వేకోడూరు ప్రాంతానికి చెందిన లక్ష్మిని ప్రేమ వివాహం చేసుకొని జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తూ కురబలకోట మండలం అంగళ్లులో ఉంటున్నాడు. సోమవారం భార్యాభర్తల మధ్య కుటుంబ సమస్యల కారణంగా గొడవ జరిగింది. దీంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన అనిల్ భార్యకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని నీవు స్వేచ్ఛగా ఉండొచ్చని ఫోన్లో చెప్పాడు. దీంతో, మనస్థాపం చెందిన లక్ష్మి(23) విష ద్రావణం తాగింది. గమనించిన స్థానికులు బాధితురాలిని వెంటనే మదనపల్లెప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు.
దారి దోపిడీ కేసులో వ్యక్తి అరెస్టు
పెనగలూరు : మండలంలోని చక్రంపేట వద్ద రాత్రి వేళలో దారిదోపిడీ చేసిన కందుల బాలవర్దన్ నాయుడు అలియాస్ బాలు అనే వ్యక్తిని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు పెనగలూరు ఎస్‌ఐ రవి వ్రకాష్ రెడ్డి తెలిపారు. 2023 మార్చి 8వ తేదిన పెనగలూరు కొత్తపల్లి గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే ఫొటోగ్రాఫర్ చిట్వేలిలో ఓ కార్యక్రమానికి హాజరై ద్విచక్ర వాహనంలో అర్థరాత్రి వేళ ఇంటికి బయలుదేరాడు. చక్రంపేట సాయి వికాస్ స్కూల్ వద్ద టి.పెంచలయ్య అలియాస్ చిన్నతో కలిసి ఫొటోగ్రాఫర్ వాహనాన్ని ఆపి అతని వద్ద రూ. 5 వేలు తీసుకొని పరారయ్యాడు. వెంటనే బాధితుడు పెనగలూరు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. అప్పట్లో పెంచలయ్య అలియాస్ చిన్నను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. బాల వర్దన్ నాయుడు అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అతను ఇటీవల పదిరోజుల క్రితం చిట్వేలి పరిసర ప్రాంతాలలో తిరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అరెస్టు చేశారు.
మద్యం విక్రేతపై కేసు నమోదు
నిమ్మనపల్లె : అధిక ధరలకు విక్రయించేందుకు అక్రమంగా మద్యం కలిగిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ తిప్పేస్వామి తెలిపారు. మండలంలోని రెడ్డివారిపల్లెకు చెందిన తుమ్మల గోపాల్ మదనపల్లెలోని వివిధ మద్యం షాపుల నుంచి మద్యం కొనుగోలు చేసి గ్రామానికి తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు. దీంతో అతనిపై నిఘా ఉంచి ఆదివారం సాయంత్రం అరెస్టు చేశామన్నారు. అతను వద్ద నుంచి రూ.6482 విలువ కలిగిన 41 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి, రిమాండ్ కు తరలించామన్నారు.