శిథిలావస్థలో అపూర్వమైన కట్టడాలు | Unprecedented Structures In Ruins On Chandragiri Konda | Sakshi
Sakshi News home page

శిథిలావస్థలో అపూర్వమైన కట్టడాలు

Published Thu, Oct 7 2021 6:44 PM | Last Updated on Thu, Oct 7 2021 7:04 PM

Unprecedented Structures In Ruins On Chandragiri Konda - Sakshi

తిరుపతి : శతాబ్దాల కాలంనాటి  చరిత్రకు ఆనవాళ్ళుగా చంద్రగిరి కోట నిలిచిపోయింది. చంద్రగిరి కోట కొండపై నిర్మించిన కట్టడాలు రోజురోజుకు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. దీంతో బావితరాలకు చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోతోంది. చంద్రగిరి కోట నిర్మాణం, అలనాటి కాలంలో రాజులు నిర్మించిన భవనాలను కాపాడాల్సిన పురావస్తు శాఖ నిద్రమత్తులో ఉందనే విమర్శలు వ్యక్తమౌతున్నాయి. చంద్రగిరికి సమీపంలో అనేక పర్యాటక ప్రాంతాలు వున్నప్పటికీ, అవి అభివృద్ధికి నోచుకోవడం లేదని పలువురు ఆవేదన చెందుతున్నారు.  ప్రభుత్వాలు చిత్తశుద్దితో వ్యవహరిస్తున్నప్పటికి  క్షేత్రస్థాయిలో పురావస్తుశాఖ అధికారుల పర్యవేక్షణ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడి పురాతన నిర్మాణాలను చూడాలని ‘ సాక్షి ’ బృందం  అన్వేషణలో అనేక విషయాలు వెలుగు చూశాయి.

శిథిలావస్థలో ఎన్నో మండపాలు
రాయలవారి కాలంనాటి శిల్పాలతోపాటు బ్రిటిష్‌ పరిపాలన కాలంలో నిర్మించిన అనేక కోటలు, ప్రహరీ గోడలు నేడు చిధ్రమౌతున్నాయి. ప్రత్యేకమైన ఈ అపూర్వకట్టడాలను కాపాడాల్సిన బాధ్యత పురావస్తు శాఖపై ఉన్నా వారు ఉదాసీనతతో ఉండిపోతున్నారని పలువురు వాపోతున్నారు. ఎంతో చరిత్ర కలిగిన కట్టడాలను పరిరక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వంపై ఉన్నా అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయం. అధికారులు  నిర్లక్షం పర్యాటకశాఖకు శాపంగా మారుతోంది. కిలో మీటర్ల మేరకు అతి కష్టంగా నిర్మించిన ప్రహారీ గోడ సైతం కోట ముందు భాగంలో కూలిపోయింది. కోట సమీపంలోని అటవీ ప్రాంతంలో కొంత మంది ఆకతాయిలు మధ్యం బాటిల్లు తాగి పారేసిన దృశ్యాలు కనిపించడంతో ప్రకృతి ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.   

సుందర ప్రాంతంగా  తాటికోన
 తాటి కోనలో తాటి వనంలో వి«శాలంగా పెద్ద పెద్ద తాటి వృక్షాలు గతంలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ రెండో మూడో తాటి చెట్లు తప్ప ఇప్పుడు తాటి వనం ఊసే కనపడడం లేదు. చుట్టూపచ్చని కొండల మధ్య అనేక చెట్లు,వనమూళికలు,వివిధ రకాల తీగలు కనిపించాయి. ఆ ప్రాంతానికి సమీపంలో నిర్మలమైన గిరిజన  నివాసాలు ఉన్నాయి. .ఆ ప్రాంతంలో నివిసించే ప్రజలు పట్టణ ప్రాంతాల్లో నివసించే ప్రజల కంటే ఎంతో ఆరోగ్యవంతంగా జీవనం సాగిస్తున్నారు. విలాసవంతమైన సౌకర్యాలు లేని లోటు ఇక్కడి ప్రజల్లో కనిపించడం లేదు. ఇప్పటీకి అటవీ ప్రాంతంపై ఆధారపడి చాలా మంది జీవనం సాగిస్తున్నారు.. తాటి కోనకు కరోనా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో బెంగుళూరు. హైదరాబాదు, తమిళ్‌నాడు, కేరళకు చెందిన  ప్రకృతి ప్రేమికులు ప్రతిరోజు నిత్యం వందల సంఖ్యలో వస్తున్నారు. 

పర్యాటక ప్రాంతంగా తాటికోన
 తాటికోన  శిథిలాలపై  చెక్కిన శిలా సంపద ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది .తిరుపతికి 15 కిలోమీటర్ల దూరంలో  చంద్రగిరికి కూతవేటు దూరంలో పురావస్తు శాఖ కంటికి ఆనకుండా ముళ్ళ పొదల  మధ్య దాగిన మన వారసత్వ సంపద ఇది.  సమీప  గ్రామాలను  దాటి మూడు కిలోమీటర్లు వెళ్ళగానే ఆ రోడ్డులో చిట్టచివరి గ్రామం తాటికోన. ఇది గిరిజన  ఆవాస ప్రాంతం. తాటికోన చుట్టూ కొండలు  ఎంత  అందంగా ఉన్నాయో చాలా మంది ప్రకృతి ప్రేమికులకు తెలియదు.  తాటికోనకు చెందిన గిరిజనులు ప్రతి శివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు వైభవంగా జరుపుతారు.

చుట్టూ పచ్చని కొండలు,  పెద్ద పెద్ద వృక్షాలు వున్న ఈ ప్రాంతంలో  నూతన వధూవరులు రాతికొండపై చుట్టూ రాళ్ళు పేర్చారు.  ఆ పేర్చిన రాళ్ళపై ఒక వెడల్పాటి పెద్ద బండను అమర్చుతుంటారు. ఆ బండ కింద పురాతన మానవుడు చెక్కిన అక్షరాలు, గుర్తులు ఉన్నాయి.ఇది క్రీస్తు పూర్వం అనేక శతాబ్దాలనాటిదై ఉండవచ్చునని ఓ అంచనా .ఇలాంటి పురాతన నిర్మాణాల  ఆనవాళ్ళు అనేకం శిథిలమై కనిపిస్తాయి. ఈ రాతికొండపై మట్టితో కట్టిన గోడ ఆన వాళ్ళూ కూడా ఉన్నాయి. చంద్రగిరి దుర్గం నిర్మించకముందు ఇక్కడ మట్టితో కట్టిన ఒక కోట గోడ ఉండి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు.ఈ మట్టిగోడ శిథిలమయ్యాకే చంద్రగిరి దుర్గాన్ని నిర్మించినట్టు స్థానిక ప్రజలు చెబుతున్నారు. 

సుందరంగా తాటికొండ 
 తాటికొండ గిరిజన ఆవాసం ప్రాంతం. కనీసం ఆప్రాంతంలో మౌలిక వసతులు లేనప్పటికీ అక్కడి ప్రజలు ఎంతో సంతోషంగా , ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నారు.    ఈ రాతి కొండపైకి  జంటలు ... జంటలుగా  వచ్చి సందర్శిస్తుంటారు. ఇక్కడ ఏకాంతంలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు. కొండ దిగి ముందుకు సాగితే ఎదురుగా పురాతనమైన ఒక పెద్ద కోనేరు దర్శనమిస్తుంది. కోనేరుకు కుడివైపు కొండ పై ఒక పెద్ద రాతి బండపై ఆలయ  గోపురాన్ని నిర్మించారు. ఆ పెద్ద బండపైకి ఎక్కడం అసాధ్యం. అంత పెద్ద బండపై ఆ గోపురాన్ని ఎలా  నిర్మించారు?ఆ పెద్ద బండపై పునాదులు లేకుండా కట్టిన ఆ గోపురం శతాబ్దాలపాటు గాలి వానలు, తుఫానులు వంటి ప్రకతి  బీభత్సాలకు తట్టుకుని  ఎలా నిబడింది!? అనేక ప్రశ్నలకు సమాధానం దొరకదు . ముళ్ళ పొదలు, మనిషెత్తు ఎదిగిన  బోదకు  ఎదురుగా ఒక చిన్న శిథిలమైన మండపం కనిపించింది. 

ఆ మండపం లోంచి లోనికి ప్రవేశించాం.ఒక పెద్ద  సుందరమైన మండపం. అక్కడక్కడా దానిపై  చెక్కిన శిల్పాలు.పెద్ద పెద్ద బండరాళ్ళను ఆనుకుని ఉన్న మండపం. గుప్త నిధుల కోసం   నేలంతా అడుగడుగునా తవ్వేసిన దృశ్యాలు కనిపించాయి.  కొండల మధ్య, ముళ్ళ మొదల్లో కొన్ని అంతుచిక్కని నిర్మాణాలు కనిపించాయి. ఇది శివాలయంగా కొందరు చెప్పుకుంటున్నారు. ఆ ఆలయ గర్భగుడిలో విగ్రహాలు లేవు. అంతా తవ్వేశారు. ఒక బండపై వినాయకుడి విగ్రహం చెక్కి ఉంది. దాని కింద చూస్తే లోతైన బావి ముళ్ళపొదలతో కప్పేసి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement