కూలి కోసం కొండంత ఆశతో వేకువనే బయలుదేరిన ఆ పేద బతుకులపై విధి కన్నెర్రచేసిందో ఏమో.. కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఆటోలో వెళ్తున్న మహిళలపైకి ఒక్కసారిగా లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. ఫలితంగా అప్పటివరకు సాగిన ముచ్చట్లు హాహాకారాలుగా మారాయి. ఆర్తనాదాలై మార్మోగాయి. కొద్దిసేపాగితే పని ప్రదేశానికి చేరుకుంటారనగా ఈ ఘోరం జరిగింది. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమై భయానకంగా మారింది. విషయం తెలిసి గుండెలు బాదుకుంటూ వచ్చిన బంధువుల రోదనలతో దిక్కులు పిక్కటిల్లాయి. ఈ హృదయ విదారక ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద బుధవారం ఉదయం జరిగింది.
దాచేపల్లి: తెలంగాణలోని నల్గొండ జిల్లా దామచర్ల మండలం నరసపురానికి చెందిన మహిళా వ్యవసాయ కూలీలు బుధవారం వేకువ జామునే గురజాల మండలం పులిపాడులో జరుగుతున్న మిర్చి కోతలకు ఆటోలో పయనమయ్యారు. ఆటో దాచేపల్లి మండలం పొందుగల వద్దకు వచ్చేసరికి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో మాలోతు కవిత(45), ఇస్లావత్ మంజుల(30), భూక్యా పద్మ(26), భూక్యా సోనీ(58), వర్తియా సక్రీ(35) అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఇస్లావత్ పార్వతి(45)తోపాటు మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పార్వతిని మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. మిగిలిన వారిని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలే
మరణించిన ఆరుగురి కుటుంబాలదీ రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితే. నరసపురంలోని సుగాలీ కాలనీకి చెందిన వీరంతా ఉన్న ఊరిలో వ్యవసాయ పనులు లేకపోవటంతో 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పులిపాడుకు కొన్నిరోజులుగా వస్తున్నారు. రోజూలాగానే బుధవారం తెల్లవారుజామునే ఆటోలో 12 మంది మహిళా కూలీలు పనులకు బయలుదేరారు. మార్గమధ్యలో ప్రమాదం జరిగి ఆరుగురు మరణించారు. తెల్లవారుజామునే ఇంట్లో నిద్రిస్తున్న బిడ్డలకు ముద్దు ఇచ్చి పనికి ఎల్లొస్త.. అంటూ చిరునవ్వుతో బయలుదేరిన వీరిని ఘటనాస్థలంలో విగతజీవులుగా చూసి వారి కుటుంబ సభ్యులు గుండెలవిసేలా విలపించారు.
అమ్మా ఒక్కసారి లేమ్మా..
మంజుల కుమార్తె నాగమణి ఘటనా స్థలంలో రోదించిన తీరు చూపరులను కలచివేసింది. ‘‘బిడ్డా కూలికిపోయొస్త.. మధ్యాహ్నానికి వస్త అని చెప్పావు కదమ్మా.. లెగమ్మా.. నాన్నా అమ్మను ఓ సారి లెగమను’’ అంటూ ఆమె విలపించిన తీరు కంటతడి పెట్టించింది. తండ్రి రంగా బిడ్డను అక్కున చేర్చుకుని ధైర్యం చెప్పినా ఫలితం లేకపోయింది. మంజులకు నాగమణితోపాటు కుమారుడు ఈశ్వర్ ఉన్నారు.
► అలాగే ప్రమాదంలో మరణించిన కవితకు భర్త, కృష్ణ, కుమార్తెలు అంజలి, సరిత, కుమారుడు ధనుష్ ఉన్నారు.
► పద్మకు భర్త భిక్షు, కుమారులు దీపక్, విక్షన్, సక్రికి భర్త సక్రు, కుమార్తెలు అంజలి, దేవిక ఉన్నారు.
► సోనీ భర్త చనిపోవడంతో కుమారుల వద్ద ఉంటూ కూలిపనులకు వస్తోంది.
ఒకవైపే రోడ్డు.. ఆపై ఆగి ఉన్న లారీలు
ఏపీ నుంచి తెలంగాణకు వెళ్తున్న ధాన్యం లారీలను సరిహద్దు వద్దే తెలంగాణ ఆర్టీఓ అధికారులు నిలిపివేస్తున్నారు. మంగళవారం రాత్రి నుంచి లారీలను నిలిపివేయటంతో పొందుగల గ్రామంలోనూ రోడ్డు పక్కనే లారీలు నిలిచాయి. పిడుగురాళ్ల వైపు నుంచి వస్తున్న ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ధాన్యం లారీలను దాటుకుంటూ వెళ్తున్న నేపథ్యంలో ఎదురుగా తెలంగాణ నుంచి కూలీలతో వస్తున్న ఆటోను గమనించకపోవటంతో ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ధాన్యం లారీలు నిలిపివేయకుంటే ఈ ప్రమాదం జరిగేది కాదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే నిర్మాణంలో భాగంగా పొందుగల గ్రామంలో రోడ్డు పక్కన ఇళ్లు ఖాళీ చేయించేందుకు గత ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ఒకవైపు మాత్రమే రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ ఇరుకు రోడ్డులోనే వాహనాలు రాకపోకలు సాగిస్తుండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment