
బిగ్‌బాస్ హోస్ట్ నాగార్జునతో తేజ్‌దీప్
తెనాలి: ‘టేస్టి తేజ’.. యూట్యూబ్‌లో చిరపరిచితమైన పేరు. హోటల్ ప్రమోషన్స్‌తో ఆరంభించి సినిమా ప్రమోషన్స్‌తో సందడి చేస్తున్న చానల్ ఇది. మూడున్నర లక్షలకుపైగా సబ్‌స్రైబర్స్.. లక్షలాది వ్యూస్ సాధిస్తున్న ప్రోగ్రాం టేస్టి తేజ. దీని నిర్వాహకుడు ఇప్పుడు బిగ్‌బాస్–7 కంటెస్టెంట్‌గా వినోదాన్ని పంచుతున్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తూనే తన అభిరుచిని లక్షలాది మంది అభిమానాన్ని చూరగొన్న ఓ యువకుడి విజయగాధ ఇది.
కుటుంబ నేపథ్యం
అసలు పేరు కల్లం తేజ్‌దీప్. తల్లిదండ్రులు శ్రీనివాసరెడ్డి, ఆదిలక్ష్మి. హైస్కూలు వరకు తెనాలిలో చదివిన తేజ్‌దీప్, విజ్ఞాన్ యూనివర్శిటీలో ఇంటర్, బీటెక్, ఎంటెక్ చేశాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగంతో 2017లో హైదరాబాద్ వెళ్లాడు.
నటనపై ఆసక్తితో..
తేజ్‌దీప్‌కు చిన్నప్పటి నుంచీ నటన, సినిమాలంటే ఆసక్తి. 8వ తరగతిలో ఉండగా అతడిని బాల నటుడిగా పరిచయం చేస్తానంటూ తమిళ నిర్మాత ఒకరు సంప్రదించారు. అయితే తేజ్ తండ్రి అంగీకరించలేదు. పాఠశాలలో, కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో తన టాలెంట్‌ను ప్రదర్శిస్తూ వచ్చిన తేజ్‌దీప్‌కు అనుకోకుండా కరోనా సెలవులు కలిసొచ్చాయి.
అనుకోకుండా ఓ రోజు..
2020లో వర్క్ ఫ్రం హోమ్‌లో ఉండగా, ఒకరోజు అనుకోకుండా తెనాలిలో స్నేహితులతో కలిసి హోటల్‌కు వెళ్లిన తేజ్ భోజనం చేస్తూ వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు. ఆ వీడియోకు మంచి రెస్పాన్స్ రావటంతో హైదరాబాద్ వెళ్లాక టేస్టీ తేజ పేరుతో హోటళ్ల సందర్శన కొనసాగించాడు. సబ్‌స్క్రైబర్స్, వ్యూస్ పెరిగాయి. దీంతో జబర్దస్త్‌లోనూ అవకాశం లభించింది. గుర్తింపూ తెచ్చుకున్నాడు. జబర్దస్త్, టేస్టీ తేజతో బిజీగా మారాడు. సినిమా ప్రమోషన్లకు టేస్టీ తేజ చానల్ వేదికైంది. ఉద్యోగానికి ఆటంకం లేకుండా, వీకెండ్‌లోనే తేజ్ వీడియోలు చేస్తున్నాడు. నాలుగు సినిమాల్లోనూ తేజ్ మెరిశాడు.
బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ
ఈనెల 3 తేదీ నుంచి జరుగుతున్న బిగ్‌బాస్ సీజన్–7లో కంటెస్టెంట్‌గా తేజ్ పోటీపడుతున్నాడు. హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జున తనతో కూడా టేస్టీ తేజ ప్రోగ్రాం చేయాలని కోరారు. షోలో ఆద్యంతం వినోదాన్ని పంచుతున్న తేజ్ రెండో వారం నామినేషన్‌కు వచ్చాడు. దీంతో అతడికి ఓట్ చేయాలని తేజ్ తల్లిదండ్రులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment