పీఎం సూర్యఘర్‌తో తగ్గనున్న విద్యుత్ భారం
మార్టూరు: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడమే కాక.. వినియోగదారుడు మిగులు విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని బాపట్ల జిల్లా ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం నోడల్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టీవీ తులసీరామ్ అన్నారు. మార్టూరు విద్యుత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం సూర్యఘర్ పథకం ప్రస్తుతం గృహ అవసరాలకు మాత్రమే వర్తిస్తుందని 10 కిలోవాట్ల వరకు కేంద్ర ప్రభుత్వం రాయితీ అందిస్తుందని తెలిపారు. 10 కిలోవాట్ల సోలార్ యూనిట్ ఖర్చు రూ.80వేలు నుంచి రూ.90వేలు వరకు ఉంటుందన్నారు. రాయితీ రూ.30 వేలు వరకు ఉంటుందని, 2 కిలోవాట్ల యూనిట్ ఖర్చు రూ.1.5 లక్షలలోపు ఉండగా రూ.60వేలు సబ్సిడీ వస్తుందన్నారు. మూడు కిలోవాట్ల యూనిట్ ఖర్చు రూ.2.10 లక్షలు ఉండ గా రూ.78 వేలు రాయితీ లభిస్తుందని తెలిపారు. 3 నుంచి 10 కిలోవాట్ల యూనిట్ వరకు గరిష్టంగా రూ.78వేలు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపారు. సోలార్ యూనిట్ వెండర్‌లు వారే 7 శాతం వడ్డీతో బ్యాంకు లోన్‌లు మంజూరు చేయిస్తారని అన్నారు.
వినియోగదారుడికి అదనపు ఆదాయం
వినియోగదారుడు తన అవసరాలు పోను మిగిలిన విద్యుత్‌ను అదే సంస్థ కొనుగోలు చేయనుందని దీనివల్ల వినియోగదారుడికి ఆదాయం చేకూరుతుందన్నారు. వినియోగదారుడు తన ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, కరెంటు బిల్లు వివరాలతో ఆన్‌లైన్‌లో స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అద్దంకి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నర్రా మస్తాన్‌రావు, మార్టూరు డీఈ ఎం సురేష్ కుమార్, డివిజనల్ ఏఈలు, జేఈలు, ఇతర సిబ్బంది, సోలార్ యూనిట్ వెండర్‌లు పాల్గొన్నారు.
జిల్లా నోడల్ ఆఫీసర్ టీవీ తులసీరామ్
Comments
Please login to add a commentAdd a comment