సమన్వయంతో తిరునాళ్లకు ఏర్పాట్లు
అమర్తలూరు (వేమూరు): అధికారులందరూ సమన్వయంతో పని చేసి శివరాత్రి తిరునాళ్లను విజయవంతం చేయాలని రేపల్లె ఆర్‌డీవో రామలక్ష్మి తెలిపారు. అమర్తలూరు మండలంలోని గోవాడ గ్రామంలో బాల కోటేశ్వర స్వామి దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో రెండో సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 26వ తేదీన శివరాత్రి తిరునాళ్ల ఉంటుందని గుర్తుచేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఆర్‌టీసీ బస్సు సర్వీసులపై ఆరా తీశారు. తెనాలి, రేపల్లె, బాపట్ల, పొన్నూరు డిపోల నుంచి 30 బస్సులు ఏర్పాటు చేస్తామని ఆర్‌టీసీ అధికారులు వివరించారు. ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ఆటోలను దేవస్థానం వరకు రానీయొద్దని ఆర్‌టీసీ అధికారులు ఈ సందర్భంగా కోరారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సౌకర్యంపై దృష్టి పెట్టాలని ఆర్డీవో అన్నారు. సీసీ కెమెరాలు, టాయిలెట్స్ ఏర్పాటుకు సూచనలు చేశారు. దర్శనం కల్పించే విషయంలో సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 26వ తేదీన రాత్రి ప్రభల ఊరేగింపులు ఉంటాయని, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని చెప్పారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తిరునాళ్ల ఐదు రోజులపాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి వేడుకను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రాపర్ల నరేంద్ర, ఎండోమెట్ అధికారి అనుపమ, రేపల్లె డీఎస్పీ శ్రీనివాసరరావు, తహసీల్దారు నెహ్రూబాబు, దేవస్థానం ఈవో అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అధికారులకు రేపల్లె
ఆర్‌డీవో సూచన
Comments
Please login to add a commentAdd a comment