శివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష
● స్థానిక అధికారులకు డీఎస్పీ, ఆర్డీవో ఆదేశం ● చినగంజాంలో అన్ని శాఖలతో సమావేశం ● భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచన
చినగంజాం: శివరాత్రి తిరునాళ్లను ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలని చీరాల డీఎస్పీ మొహ్మద్ మొయిన్ పేర్కొన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో చినగంజాంలోని రామకోటేశ్వర, బాలకోటేశ్వరస్వామి శివరాత్రి తిరునాళ్ల నిర్వహణకు సంబంధించి మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తిరునాళ్లను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, అందుకు పోలీసు శాఖతో దేవాలయాల కమిటీలు, ప్రజలు సహకరించాలన్నారు. వాహనాలను నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే నిలపాలని పేర్కొన్నారు. ప్రభల వద్ద నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను సమయ పాలన పాటించాలని సూచించారు. చిన్నపాటి సమస్యలు తలెత్తినా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఆర్డీవో చంద్రశేఖర్ నాయుడు మాట్లాడుతూ.. భక్తులు రైల్వే ట్రాక్ వద్ద ఇబ్బందులు పడకుండా అధికారులు, దేవాలయ కమిటీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యం, తాగునీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖాధికారులు సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. దేవాలయాల్లో అర్ధరాత్రి నుంచి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నందున ఆలయ కమిటీలు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణాలలో వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సకాలంతో ఏర్పాట్లు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశానికి ముందుగా అధికారులు లలితా రామకోటేశ్వరాలయం, బాలకోటేశ్వరాలయాలను సందర్శించారు. అధికారులకు సంప్రదాయాల ప్రకారం ఆహ్వానం పలికి, పూజాది కార్యక్రమాలను నిర్వహించాక శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, ఎంపీడీఓ ఏ శ్రీనివాసమూర్తి, సీఐ వైవీ రమణయ్య, ఎస్‌ఐ శీలం రమేష్, రెండు దేవాలయాల కమిటీల ప్రతినిధులు టీఎస్సార్ ఆంజనేయులు, కుర్రి రామసుబ్బారావు, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment