
ఆటో బోల్తా పడి 10 మందికి గాయాలు
తెనాలి రూరల్: కుక్కలను తప్పించబోయి ఆటో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ సహా 10 మంది గాయాలపాలయ్యారు. తెనాలి వైకుంఠపురం సమీపంలో గురువారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మూల్పూరు గ్రామానికి చెందిన ధర్మ, యాకోబు, బెంజమిన్, మరియమ్మ, శ్యామల, వెంకటరత్నం, అమ్మారావు, సుశీల, సైమాన్ రాయి పని కోసం తెనాలి మండలం కొలకలూరుకు కొద్ది రోజులుగా వస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం మూల్పూరుకే చెందిన ఆటో డ్రైవర్ మూల్పూరి నరేష్ ఆటోలో వీరు వస్తున్నారు. తెనాలి వైకుంఠపురం సమీపంలో రహదారిపై మూడు కుక్కలు అడ్డు వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో ఆటో బోల్తా కొట్టడంతో అందులోని 10 మంది గాయపడ్డారు. 108లో వారిని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వీరిలో యాకోబు పరిస్థితి విషమంగా ఉండంతో గుంటూరు పంపారు. ఘటనపై త్రీ టౌన్ పోలీసులు విచారిస్తున్నారు.