
మద్యం మత్తులో సముద్రంలోకి దిగితే కఠిన చర్యలు
● బహిరంగ ప్రదేశంలో
మద్యం తాగినా జైలు శిక్ష తప్పదు
● మహిళలతో అసభ్యంగా
ప్రవర్తిస్తే సహించేది లేదు
● బీచ్ సందర్శకులకు
జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ హెచ్చరిక
● నిర్దిష్ట లోతును సూచించేలా
జెండాల ఏర్పాటు
బాపట్ల టౌన్: మద్యం మత్తులో సముద్రంలోకి దిగే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని, ఈ మేరకు పోలీసు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తుషార్‌డూడీ తెలిపారు. బుధవారం సూర్యలంక తీరంలో జిల్లా ఎస్పీ పర్యటించారు. తీరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు, గజ ఈతగాళ్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... సూర్యలంక బీచ్ పర్యాటకంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిందన్నారు. వేసవి కావడంతో యాత్రికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. దానికి అనుగుణంగా సందర్శకుల రక్షణ కోసం పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. తీర ప్రాంతంలో పోలీస్ గస్తీని ముమ్మరం చేయడంతోపాటు బీచ్‌లో యాత్రికులు ప్రమాదాలకు గురైనప్పుడు వారిని రక్షించేందుకు స్థానిక, మైరెన్ పోలీసులతోపాటు గజ ఈతగాళ్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కువ లోతులోకి వెళ్లే వారిని సులభంగా గుర్తించి అప్రమత్తం చేసేందుకు డ్రోన్‌లను వినియోగించాలని పేర్కొన్నారు. సముద్ర తీరాలకు విహారానికి వచ్చే యాత్రికులు పోలీస్ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. సముద్రంలో నిర్దిష్ట లోతు దాటి లోపలకి వెళ్లకుండా యాత్రికులను అప్రమత్తం చేస్తూ సముద్రంలో జెండాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. యాత్రికులు బీచ్ పరిసరాల్లో వ్యవహరించాల్సిన తీరును వివరిస్తూ తీరంలో ప్రచార బోర్డులను ఏర్పాటు చేయాలని సూచించారు. లోతుకు వెళ్తున్న యాత్రికులను అడ్రెస్సింగ్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉండాలన్నారు. గజ ఈతగాళ్లు, పోలీస్ సిబ్బంది లైఫ్ జాకెట్స్ ధరించి అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో యాత్రికులను మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించేందుకు ఆంబులెన్‌న్స్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. బీచ్ పరిసరాల్లోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగకుండా, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీస్ గస్తీ ముమ్మరం చేయాలని తెలిపారు. మహిళా యాత్రికులు దుస్తులు మార్చుకొనుటకు తాత్కాలిక గదులను ఏర్పాటు చేయించాలని పేర్కొన్నారు. వాటి వద్ద మహిళా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు, ఎస్‌బీ సీఐ నారాయణ, బాపట్ల రూరల్ సీఐ శ్రీనివాసరావు, పోలీస్ అధికారులు, మైరెన్ పోలీసులు, గజ ఈతగాళ్లు పాల్గొన్నారు.