
శ్మశానవాటిక సమస్య పరిష్కారానికి కృషి
ఆర్డీవో చంద్రశేఖర నాయుడు
చీరాల టౌన్: వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో శ్మశాన వాటిక భూమి కోల్పోయిన విజయనగర్‌కాలనీ గ్రామస్తుల సమస్యను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని చీరాల ఆర్డీఓ తూమాటి చంద్రశేఖరనాయుడు హామీ ఇచ్చారు. రెండు రోజుల కిందట కలెక్టర్ వెంకట మురళిని విజయనగర్‌కాలని గ్రామ పంచాయతీ పెద్దలు, ప్రజలు కలిసి గ్రామానికి కేటాయించిన శ్మశానవాటిక భూమి 167–ఏ రోడ్డు నిర్మాణంలో కోల్పోయామని ఫలితంగా తాము పడుతున్న బాధలు, ఇబ్బందులను పరిష్కరించాలని వినతిపత్రాన్ని కలెక్టర్‌కు అందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం విజయనగర్‌కాలనీ గ్రామ పంచాయతీలోని శ్మశానవాటిక స్థలాన్ని గ్రామస్తులు, గ్రామపెద్దలతో కలిసి ఆర్డీవో చంద్రశేఖర నాయుడు పరిశీలించారు. విజయనగర్‌కాలనీ గ్రామానికి 1985లో కేటాయించిన ఎనిమిది ఎకరాల శ్మశాన భూమికి సంబంధించిన రికార్డులతో పాటుగా వాడరేవు–పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోయిన శ్మశాన భూమి ప్రాంతాలను పరిశీలించారు. తమకు శ్మశాన భూమిని కేటాయించడంతోపాటుగా రోడ్డు నిర్మాణంలో టన్నెల్‌ను తమ గ్రామంలో నిర్మాణం చేయించాలని అధికారులను గ్రామస్తులు కోరారు. దీనిపై ఆర్డీవో మాట్లాడుతూ విజయనగర్ కాలనీ గ్రామస్తుల సమస్యను జిల్లా కలెక్టర్ వెంకట మురళి సమక్షంలో ఈనెల 21న నేషనల్ హైవే అథారిటీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్ సమక్షంలో పరిష్కారం లభిస్తుందని ప్రజా సమస్యల పరిష్కారానికి తమవంతు సహకారం అందిస్తానని గ్రామస్తులకు ఆర్డీవో హామీ ఇచ్చారు. ఆర్డీవోతో పాటుగా తహసీల్దార్ కె.గోపికృష్ణ, గ్రామస్తులు లక్ష్మీప్రసాద్, ఏసుపాదం, లక్ష్మీనరసయ్య, వందనం, రాజేష్, వెంకటేశ్వర్లు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.