
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
జె.పంగులూరు: మండల పరిధిలోని పంగులూరు గ్రామానికి చెందిన జంపు శంకరరావు (55) ఈనెల 10వ తేదీన ముప్పవరం గ్రామంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలపాలయ్యాడు. గుంటూరులోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. పంగులూరు గ్రామానికి చెందిన జంపు శంకరరావు మార్టూరు కూరగాయాల మార్కెట్‌లో రోజువారి కూలీగా పనిచేస్తూ జీవనం సాగుస్తుంటాడు. రోజు మాదిరిగానే ఈనెల 10వ తేదీ మార్టురు మార్కెట్ కూలి పనికి వెళ్లి పని ముగించుకొని తిరిగి వస్తున్నాడు. ముప్పవరం వచ్చే సరికి జాతీయ రహదారిపై బైక్ పై వస్తున్న శంకరరావును గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ప్రమాదంలో తలకు బలమైన గాయాలయ్యాయి. సోమవారం మృతి చెందగా మృతదేహాన్ని పంగులూరు స్వగ్రామం తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.