బాధ్యతలు స్వీకరిస్తున్న కలెక్టర్ ప్రియాంక ఆల
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి జిల్లా తనకు సుపరిచితమేనని, గతంలో ఈ జిల్లాకు చాలా సార్లు వచ్చానని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలి పారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయం (ఐడీఓసీ)లో శనివారం సాయంత్రం ఆమె బాధ్యతలు స్వీరించారు. అనంతరం ఐడీఓసీ ప్రాంగణమంతా కలియదిరిగారు. ఇదే క్యాంపస్‌లో ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయాన్ని సైతం కుటుంబసభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
బంధుత్వం ఉంది
తనది తెలంగాణేనని, పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోని ఉప్పల్ అని కలెక్టర్ తెలిపారు. స్థానికురాలినే కావడంతో ఈ రాష్ట్రం, ఇక్కడి జిల్లాలపై అవగాహన ఉందన్నారు. పైగా భద్రాద్రి జిల్లాలో బంధువులు కూడా ఉన్నారని, చిన్నప్పుడు చాలా సార్లు ఈ జిల్లాకు వచ్చానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. 2016లో ఐఏఎస్‌గా ఎంపికై న తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్‌గా, హైదరాబాద్ నగర పరిధిలో అడిషనల్ కమిషనర్, జోనల్ కమిషనర్‌గా పని చేసినట్టు తెలిపారు. తన సర్వీసులో పని చేసిన రెండూ అర్బన్ ప్రాంతాలని, తొలిసారిగా గ్రామీణ ప్రాంత జిల్లా అధికారిగా రావడం సంతోషంగా ఉందని చెప్పారు. పైగా ఈ జిల్లాలో గిరిజన జనాభా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం తరఫున వారికి చేయాల్సింది ఎంతో ఉందని అన్నారు.
చాలా చేయొచ్చు..
ఇక్కడికి బదిలీ అయిందని తెలియగానే జిల్లాకు సంబంధించిన విషయాలు తెలుసుకునే పనిలో పడ్డానని చెప్పారు. ఇంతకాలం ఇక్కడ కలెక్టర్‌గా పని చేసిన అనుదీప్ దురిశెట్టి తనకు ఫోన్ చేసి.. రాష్ట్రంలోనే ఆదివాసీలు అధికంగా నివసించే జిల్లాకు కలెక్టర్‌గా వస్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. కలెక్టర్‌గా ఈ జిల్లాకు చాలా పనులు చేయొచ్చని, బదిలీపై వెళ్తున్న తనకు ఈ జిల్లా ఎంతో సంతృప్తిని ఇచ్చిందని అన్నారని తెలిపారు.
4:23 గంటలకు
హైదరాబాద్ నుంచి నేరుగా కొత్తగూడెం ఐడీఓసీకి శనివారం సాయంత్రం కలెక్టర్ చేరుకున్నారు. ఐడీఓసీ మొదటి అంతస్తులోని కలెక్టర్ చాంబర్‌కు చేరుకుని ఆసీనులయ్యారు. సాయంత్రం 4:23 గంటలకు కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ.. వైద్య విద్యను అభ్యసించిన తాను ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో సివిల్ సర్వీస్‌లోకి వచ్చినట్లు తెలిపా రు. కలెక్టర్‌కు వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తమను తాము పరిచయం చేసుకున్నారు. కలెక్టర్ ప్రియాంక అలా వెంట అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, అన్ని ప్రభుత్వ శాఖ జిల్లా అధికారులు ఉన్నారు.
ఎంబీబీఎస్ టు సివిల్స్..
కలెక్టర్ ప్రియాంక హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో పుట్టి పెరిగారు. హబ్సిగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్‌లో చదువుకున్నారు. ఇంటర్ తర్వాత మహారాష్ట్రలోని ఎంజీఎంఎస్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. 2016 బ్యాచ్‌లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆమె భర్త మణిపాల్‌కుమార్ గాంధీ ఆస్పత్రిలో సర్జన్‌గా పని చేస్తున్నారు. పిల్లలు మైరా (పాప), కియాన్ (బాబు) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment