అధునాతనంగా నిర్మించినా..
కొత్తగూడెంఅర్బన్: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయానికి నూతన భవనం నిర్మించి మూడు నెలలవుతున్నా ఇంకా వినియోగంలోకి రాలేదు. కొత్త భవనంలోకి వెళ్లబోమని పాఠకులు చెబుతుండటంతో పాత భవనంలోనే కొనసాగిస్తున్నారు. పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్‌లో దశాబ్దాల కాలం నుంచి జిల్లా గ్రంథాలయం కొనసాగుతోంది. ఇక్కడికి జిల్లా కేంద్రంతోపాటు టేకులపల్లి, పాల్వంచ, జూలూరుపాడు, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాల నుంచి పాఠకులు వస్తుంటారు. ఉదయం, సాయంత్రం వేళల్లో న్యూస్ పేపర్లు, పోటీ పరీక్షల పుస్తకాలను చదువుకుంటారు. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ల సమయంలో పాఠకుల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పాఠకుల సౌకర్యం కోసం ఇటీవల బీఆర్‌ఎస్ కార్యాలయం భవనం పక్కన రూ.1.50 కోట్లతో గ్రంథాలయానికి అధునాతన హంగులతో భవనం నిర్మించారు. గతేడాది నవంబర్ నెలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. అనంతరం నూతన భవనంలోకి పుస్తకాలను తరలిస్తారని అందరూ భావించారు. కానీ పాఠకులు కొత్త భవనంలోకి వెళ్లబోమని తేల్చి చెప్పడంతో గ్రంథాలయ నిర్వాహకులు కూడా చేసేది ఏమి లేక పాత భవనంలోనే జిల్లా గ్రంథాలయాన్ని కొనసాగిస్తున్నారు.
సౌకర్యాలకు ప్రతిపాదనలు
గ్రంథాలయ కొత్త భవనంలో ఏసీలు, ముందు ప్రాంగణంలో షెడ్లు, మొక్కలు, చెట్లు, గ్రీనరీ లేవు. దీంతో అక్కడికి వెళ్లేందుకు పాఠకులు విముఖత చూపుతున్నారు. రానున్న వేసవి కాలంలో, అందులోనూ కొత్తగూడెంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నూతన భవనంలో ఏసీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఉదయం, సాయంత్ర వేళల్లో పాఠకులు చెట్ల కింద కూర్చుని చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు. నూతన భవనం దగ్గర అసలు చెట్లే లేకపోవడంతో అక్కడికి వెళ్లేందుకు పాఠకులు ఇష్టపడటంలేదు. దీంతోపాటు భవనం ముందు భాగంలో ఆహ్లాదం కోసం గ్రీనరీ కూడా ఏర్పాటు చేయాలని పాఠకులు కోరుతున్నారు. దీంతో గ్రంథాలయ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రతిపాదనలు సమర్పించాక ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే ఏసీలు, గ్రీనరీ వంటి ఏర్పాటు సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది. లేకపోతే పోస్టాఫీసు సెంటర్‌లోని పాత భవనంలోనే గ్రంథాలయం కొనసాగించాల్సి వస్తుంది. ప్రస్తుతం గ్రంథాలయానికి ఉదయం, సాయంత్ర వేళ్లల్లో రోజూ 150 మంది వరకు పాఠకులు వస్తున్నారు. నోటిఫికేషన్ల సమయంలో వీరి సంఖ్య 400కు చేరే అవకాశం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చే సమయంలోగా నూతన భవనంలో సౌకర్యాలు కల్పిస్తే పాఠకులకు సౌకర్యవంతంగా ఉంటుంది. నూతన గ్రంథాలయ భవనం వినియోగంలోకి తీసుకొచ్చే విషయమై జిల్లా గ్రంథాలయ సెక్రటరీని వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించగా.. వారు స్పందించలేదు.
వినియోగంలోకిరాని
గ్రంథాలయ కొత్త భవనం
షెడ్లు, గ్రీనరీ, ఏసీలు లేకపోవడంతో పాఠకుల విముఖత
విధిలేక పాత భవనంలోనే
లైబ్రరీ కొనసాగిస్తున్న అధికారులు
రూ.1.50 కోట్లతో నిర్మించిన భవనం నిరుపయోగమే
Comments
Please login to add a commentAdd a comment