రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
జూలూరుపాడు: మండలంలోని వినోభానగర్ – జూలూరుపాడు గ్రామాల మధ్య రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రవి కథనం మేరకు.. చండ్రుగొండ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన, లారీడ్రైవర్‌గా పనిచేస్తున్న ఈసం శేఖర్‌బాబు (27) విధుల్లో చేరేందుకు తన బైక్‌పై ఖమ్మం వెళ్తున్నాడు. జూలూరుపాడు సబ్ మార్కెట్ యార్డు దాటిన తరువాత గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో శేఖర్‌బాబు మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి ఈసం కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి చెప్పారు.
ఇద్దరికి దేహశుద్ధి
అశ్వారావుపేటరూరల్: మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం ఇద్దరికి దేహశుద్ధి చేసి ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ వివాహితతో గాండ్లగూడేనికి చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో వివాహిత ఇంటికి వచ్చిన వ్యక్తిని గమనించిన స్థానికులు.. వారిద్దరినీ పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసినట్లు సమాచారం. దీనిపై కొందరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఎస్‌ఐ యయాతి రాజును వివరణ కోరగా ఘటనపై సమాచారం అందినా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు రాలేదని తెలిపారు.
ఉద్యోగి నుంచి డబ్బు వసూలుకు పన్నాగం
● మహిళలను వేధించిన కేసు నమోదైందని బెదిరింపులు
ఖమ్మంఅర్బన్: సైబర్ మోసాలు రోజురోజుకు కొత్తపుంతలు తొక్కుతున్నాయి. అలాంటి ఘటనే సోమవారం వెలుగుచూసింది. ఖమ్మం మమత రోడ్డులో నివాసముండే ఓ వ్యక్తి ఖమ్మం రూరల్ మండలంలోని పంచాయతీరాజ్‌శాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు సోమవారం గుర్తు తెలియని నంబర్ నుంచి ఫోన్ రాగా హిందీ, ఇంగ్లిషు భాషల్లో మాట్లాడిన అవతలి వ్యక్తి బెంగళూరు పోలీసుగా చెప్పుకున్నాడు. సదరు ఉద్యోగి ఫోన్ నుంచి మహిళలకు ఫోన్ చేస్తూ వేధిస్తున్నారని, ఈ విషయమై అందిన ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదైందని చెబుతూ, సెటిల్‌మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేశాడు. దీంతో కంగారు పడిన సదరు ఉద్యోగి తన మిత్రుడు పోలీసు శాఖలో ఉండడంతో సమాచారం ఇచ్చాడు. అయితే, ఇది సైబర్ నేరగాళ్ల పనేనని పోలీసు ఉద్యోగి చెప్పడంతో తనకు వచ్చిన ఫోన్ నంబర్ వివరాలతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment