ఉపాధి పనుల్లో రక్షణ చర్యలు పాటించాలి
పాల్వంచరూరల్ : రోజురోజుకూ ఎండలు ముదురుతున్నందన ఉపాధి హామీ పనులకు వచ్చే కూలీలు రక్షణ చర్యలు పాటించాలని డీఆర్‌డీఓ విద్యాచందన అన్నారు. మండలంలోని జగన్నాథపురంలో చేపడుతున్న పనులను మంగళవారం ఆమె పరిశీలించారు. కూలీలు ఉదయమే పనికి రావాలని, ఎండతీవ్రత పెరగకముందే ముగించాలని చెప్పారు. రోజుకు రూ.300 వేతనం వచ్చేలా కొలతల ప్రకారం పని చేయాలన్నారు. ఈజీఎస్ పథకం ద్వారా రైతులు ఫారం పాండ్‌లు నిర్మించుకోవాలని సూచించారు. పొలాలకు వెళ్లేందుకు రహదారి సౌకర్యం ఏర్పాటు చేసుకోవాలంటే ఆయా భూముల రైతుల అనుమతులతో రోడ్డు నిర్మించుకునే అవకాశం ఉందని తెలిపారు. ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీలదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కె.విజయభాస్కర్ రెడ్డి, టెక్నికల్ అధికారి రాజు, ఏపీఓ రంగా, శ్రీను, కార్యదర్శులు సాయిరాం, రవికుమార్, ఎఫ్‌ఏలు శంకర్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
వసతి గృహంలో తనిఖీ..
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని బీసీ బాలికల వసతి గృహాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, బీసీ సంక్షేమాధికారి ఇందిర మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. బాలికలకు చదువుతోనే సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదివినప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నారు. ఆ తర్వాత హాస్టల్‌లోని మెస్, బాలికల వసతి గదులను పరిశీలించారు. విద్యార్థినులకు హాస్టళ్లలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని, సద్వినియోగం చేసుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. అనంతరం బాలికలతో కలిసి భోజనం చేశారు.
డీఆర్‌డీఓ విద్యాచందన
Comments
Please login to add a commentAdd a comment