సాగు భూములు స్వాధీనం
ఇల్లెందురూరల్: మండలంలో సమీకృత గురుకులం నిర్మాణం పేద రైతులకు శాపంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో సమీకృత గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇల్లెందులోనూ నిర్మాణానికి అవసరమైన 20 ఎకరాల స్థలం కోసం రెవెన్యూ అధికారులు అన్వేషణ ప్రారంభించారు. పలు చోట్ల భూములు గుర్తించినప్పటికీ అటవీ, రెవె న్యూ శాఖల మధ్య సమన్వయం కుదరలేదు. ఇక సింగరేణి పరిధిలో మినహాయిస్తే ఖాళీగా ప్రభుత్వ స్థలం ఎక్కడా లేదని రెవెన్యూ అధికారులు నిర్ధారించుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు లేని ప్రభుత్వ సర్వే నంబర్లు కలిగి ఉన్న సాగు భూములపై కన్నేశారు. జేకేఓసీకి సమీపంలో.. 21 ఇంక్లైన్ భూగర్భ గని ఉపరితలంలో.. మున్సిపాలిటీ డంప్‌షెడ్డుకు పక్కన దశాబ్దాలుగా గిరిజనేతరుల ఆధీనంలో సాగవుతున్న భూమిని స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. గతంలో సాగులో ఉన్న వారికి నేరుగా కాకుండా కార్యాలయం నోటీస్ బోర్డులో, సాగులో ఉన్న వారికి మౌఖికంగా సమాచరం ఇచ్చి వారి వద్ద ఉన్న ఆధారాలు చూపించాలని ఆదేశించారు. తాజాగా మంగళవారం సాగుభూమిలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. సమీకృత గురుకులం నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకొందని, ఎవరు వచ్చినా చర్యలు తీసుకుంటామని ఫ్లెక్సీలో ఉంది. విషయం తెలుసుకున్న బాధిత 28 మంది రైతులు తహసీల్దార్ రవికుమార్‌ను కలిసి ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు లేనందున ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తహసీల్దార్ స్పష్టం చేశారు. కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు రైతులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment