ఏసీబీ వలలో అటవీ అధికారులు | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అటవీ అధికారులు

Published Wed, Feb 19 2025 12:11 AM | Last Updated on Wed, Feb 19 2025 12:10 AM

ఏసీబీ వలలో అటవీ అధికారులు

ఏసీబీ వలలో అటవీ అధికారులు

ఇల్లెందురూరల్‌ : అటవీ భూముల నుంచి మట్టి తరలించేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఎఫ్‌ఆర్‌ఓ, ఎఫ్‌బీఓ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ ఘటన ఇల్లెందు మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన భారీ వర్షాలతో పలు గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందిగా మారడంతో మండలంలోని బోడుతండా, కొమరారం, పోచారం తండా గ్రామాల రైతులు స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ద్వారా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. దీంతో కలెక్టర్‌ ఫ్లడ్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఒక్కో గ్రామానికి రూ.1.50 లక్షల చొప్పున విడుదల చేశారు. పొలాలకు వెళ్లే రహదారులపై గ్రావెల్‌ పోసుకోవాలని సూచించారు. దీంతో బోడుతండాకు చెందిన ఓ రైతు ఈ ఏడాది సంక్రాంతి రోజున మట్టి కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న కొమురారం ఎఫ్‌ఆర్‌ఓ ఉదయ్‌కిరణ్‌, ఎఫ్‌బీఓ హరిలాల్‌ మట్టి తరలింపును అడ్డుకుని జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో రైతు రూ.15వేలు ముట్టజెప్పి జేసీబీని విడిపించుకున్నాడు. ఆపై మొరం తోలకానికి అనుమతి ఇవ్వాలని అటవీ అధికారులను వేడుకోగా రూ.50 వేలు లంచం డిమాండ్‌ చేశారు. చివరకు బతిమిలాడి రూ.20 వేలు చెల్లించి పనులు ప్రారంభించాడు. అయితే పొలాలకు నీరు పెడుతుండడంతో ఆ దారిలో ట్రాక్టర్‌ వెళ్లేందుకు వీల్లేక కొన్ని రోజులు పనులు నిలిపివేసి, వారం క్రితం మట్టి తోలుకుంటున్నట్టు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. మిగిలిన రూ.30 వేలు ఇస్తేనే మట్టి తీసుకెళ్లాలని వారు ఖరాఖండిగా చెప్పడంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మంగళవారం రూ.30 వేలు తీసుకుని అటవీ రేంజ్‌ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడ ఎఫ్‌ఆర్‌ఓ సూచనతో ఎఫ్‌బీఓకు నగదు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

రూ.30 వేలు లంచం తీసుకుంటూ

పట్టుబడిన ఎఫ్‌ఆర్‌ఓ, ఎఫ్‌బీఓ

తీరు మారని అటవీశాఖ..

అవినీతికి పాల్పడి సొంతశాఖ అధికారుల విచారణలో అక్రమాలు వెలుగుచూడటంతో కొందరు అటవీ అధికారులు సస్పెన్షన్లకు గురవుతున్నారు. ఈ తతంగం ఇల్లెందు అటవీ డివిజన్‌లో వరుసగా చోటుచేసుకుంటోంది. అయినా అధికారుల్లో మార్పు రావడం లేదు. లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరమే అయినా కొందరు అధికారులు ఎంతో కొంత ముట్టజెప్పనిదే పని చేయడం లేదు. తాజాగా కొమరారం ఎఫ్‌ఆర్‌ఓ, ఎఫ్‌బీఓ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టబడగా.. గత నెలలో మైనారిటీ గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిబ్బందికి వేతనం ఇచ్చే విషయంలో రూ.2వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆరు నెలల క్రితం అవినీతికి పాల్పడడంతో అటవీశాఖ ఇల్లెందు డివిజన్‌ అధికారి కర్నావత్‌ వెంకన్నను ఏకంగా విధుల నుంచి తొలగించారు. ఇంకా మున్సిపల్‌, ఇరిగేషన్‌ శాఖల అదికారులు సైతం ఏసీబీకి చిక్కారు.

అటవీశాఖలో సస్పెన్షన్ల పర్వం..

ఏడాది క్రితం జేకే ఓసీ నిర్వాసిత ప్రాంతంలో చోటుచేసుకున్న అక్రమాల ఆరోపణలతో ఇల్లెందు రేంజ్‌ ధర్మాపురం బీట్‌ అధికారి చందూలాల్‌, గుండాల మండలం కాచనపల్లి రేంజ్‌ పరిధిలోని జగ్గుతండా బీట్‌ అధికారి హనుమంతు, నారవేప కలప మాయమైన ఆరోపణలతో డీఆర్‌ఓ బేగం, కాచనపల్లి రేంజ్‌ పెద్దతోగు బీట్‌ అధికారి నిర్మల అక్రమాలకు పాల్పడి సస్పెన్షన్‌కు గురయ్యారు. మూడేళ్ల క్రితం ఇల్లెందు రేంజ్‌ అధికారి రవికిరణ్‌, డీఆర్‌ఓలు సుక్కి, జయరాం, బీట్‌ అధికారి సైతం సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే. ఇలా పలువురు అధికారులపై వేటు పడుతున్నా.. ప్రస్తుతం విధుల్లో ఉన్నవారు తమ పనితీరును మార్చుకోకపోవడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement