నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశం
సూపర్‌బజార్(కొత్తగూడెం): అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యాచందన, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, ఇతర అధికారులతో బుధవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గృహ, వాణిజ్య అవసరాలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆటో జనరేటర్లు సిద్ధం చేయాలన్నారు. రైతు భరోసా దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియకు పార్షియల్ సబ్‌డివిజన్ మార్కింగ్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చిందని, తహసీల్దార్లు, మండల వ్యవసాయాధికారులు తమ పరిధిలో వ్యవసాయ యోగ్యం కాని భూముల మార్కింగ్‌ను వారం రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో ఎంత యూరియా అందుబాటులో ఉంది, ఇంకా ఎంత అవసరమో నివేదికలు అందజేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. రైతు భరోసా ఫిర్యాదులపై సమగ్ర నివేదికలు అందించాలన్నారు.
పోటీలకు రావడమే తొలి విజయం
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ కళాశాలల్లో శాస్త్రవేత్తలుగా, వివిధ హోదాల్లో ఉన్నవారు క్రీడా పోటీలకు రావడమే తొలి విజయంగా భావించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల మైదానంలో ఏజీ యూనివర్సిటీ పరిధిలోని నాలుగు జోన్ల క్రీడా పోటీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆటల్లో పోటీతత్వం ఉండాలని, అప్పడే లక్ష్యం చేరుకుంటామని అన్నారు. క్రీడలతో శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారని, ప్రతి ఒక్కరూ క్రీడాలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఇక్కడి పచ్చని వనాలు, పామాయిల్ తోటలు, నర్సరీలు స్వాగతం పలుకుతాయని అన్నారు. ఈనెల 22 వరకు జరిగే ఈ పోటీలకు నాలుగు జోన్ల పరిధిలోని 9 కళాశాలల నుంచి 110 మంది బోధనా సిబ్బంది హాజరయ్యారు. కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్ డాక్టర్ సీహెచ్ వేణుగోపాల్‌రెడ్డి, అబ్జర్వర్ సురేష్, కళాశాల అసోసియేట్ డీన్ హేమంత్ కుమార్, ఎస్.మధుసూధన్ రెడ్డి, శ్రావణ్ కుమార్, శీరిష తదితరులు పాల్గొన్నారు.
మునగ సాగు విస్తరించాలి..
మునగ పంట సాగును మరింత విస్తరించేలా కృషి చేయాలని కలెక్టర్ పాటిల్ అన్నారు. వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు సాగు చేస్తున్న మునగ తోటను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పంట సాగుతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, వారిని ప్రోత్సహించాలని అన్నారు. ఉద్యాన పంటలకు ప్రభుత్వాలు అందించే రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ వనం కృష్ణ ప్రసాద్, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్, ఎంపీఓ సోయం ప్రసాద్‌రావు పాల్గొన్నారు.
విద్యతోనే భవిష్యత్ బాగుంటుంది
కొత్తగూడెంఅర్బన్: విద్యతోనే భవిష్యత్ బాగుంటుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. లక్ష్మీదేవిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో మాట్లాడుతూ కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఉత్తమ ఫలితాలు సాధించాలని, తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. పరీక్షలు సమీపిస్తున్నందున సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలని సూచించారు. సందేహాలుంటే ఉపాధ్యాయుల ద్వారా నివృత్తి చేసుకోవాలని చెప్పారు. 100 శాతం ఫలితాలు వచ్చేలా కృషి చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ఆవరణలో నాటిన మొక్కలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యానికి మేలు చేసే మునగ, కరివేపాకును వంటల్లో వినియోగించాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం కొండలరావు, ఎంపీడీఓ చలపతి తదితరులు పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి
Comments
Please login to add a commentAdd a comment