అశ్వారావుపేటరూరల్: ఓ చిన్నారి మృతిపై ఆలస్యంగా అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు రాగా, ఖననం చేసిన మృతదేహాన్ని గురువారం వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్సై టీ యయాతి రాజు కథనం ప్రకారం.. మండల పరిధిలోని నారాయణపురం గ్రామానికి చెందిన నారదాసు రామకృష్ణ, వరలక్ష్మి దంపతులకు నాలుగు నెలల చిన్నారి ఉంది. పాపకు ఈ నెల 5న అశ్వారావుపేటలోని సబ్ సెంటర్‌లో టీకా వేయించగా, 6న మధ్యాహ్నం మృతి చెందింది. అదే రోజు చిన్నారి మృతదేహాన్ని ఖననం చేశారు. బుధవారం రాత్రి తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి రామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించినట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment